‘కృష్ణా’పై ఏపీ తొండాట!

 ‘కృష్ణా’పై ఏపీ తొండాట!
  • నీటి వాడకంపై అడ్డగోలు వాదనలు
  • యుటిలైజేషన్​ డేటా ఇచ్చేందుకు విముఖత

కృష్ణా నీళ్లపై ఏపీ మళ్లీ తొండాట మొదలు పెట్టింది. శుక్రవారం సాయంత్రంలోగా యుటిలైజేషన్‌‌‌‌ డేటా ఇస్తామని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు చెప్పిన ఏపీ జలవనరుల శాఖ అధికారులు మళ్లీ ప్లేటు ఫిరాయించారు. లెక్కలు చెప్పేందుకు ఇంకో రెండు రోజులు టైం పడుతుందని బోర్డుకు సమాచారం ఇచ్చారు. నీటి వాటాలపైనా అడ్డగోలు వాదనలు చేశారు. దీంతో ఏపీ అధికారుల తీరుపై  బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్‌‌‌‌ 4 వరకు ఎన్ని నీళ్లను వాడుకున్నారో మొత్తం డేటా ఇస్తే తప్ప ఇకపై నీటి విడుదలకు రిలీజ్‌‌‌‌ ఆర్డర్స్​ ఇవ్వబోమని తేల్చిచెప్పింది. యుటిలైజేషన్​ డేటాపై  కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గురువారం జలసౌధలో  తెలంగాణ, ఏపీ ఇరిగేషన్‌‌‌‌ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించింది. పూర్తి స్థాయి లెక్కలతో మీటింగ్​ వస్తామన్న ఏపీ అధికారులు.. చెప్పిన దానికి విరుద్ధంగా సెప్టెంబర్‌‌‌‌ 18 వరకు తీసుకున్న నీటి లెక్కలను మాత్రమే బోర్డు ముందుంచారు. ఈ మధ్య కృష్ణా నదికి వరద పోటెత్తడంతో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేసి నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారని, ఫ్లడ్‌‌‌‌ డేస్‌‌‌‌లో తీసుకున్న నీటికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని ఏపీ అధికారులు అడ్డంగా వాదించారు. ఏపీ వాదనను తెలంగాణ ఇంజనీర్లతో పాటు బోర్డు అధికారులు కూడా తప్పు పట్టారు. యుటిలైజేషన్‌‌‌‌ లెక్కలు కావాల్సిందేనని బోర్డు గట్టిగా పట్టుపట్టడంతో ఏపీ అధికారులు నీళ్లు నమిలారు. సాయంత్రం వరకు ఎదురుచూసినా  ఎలాంటి సమాచారం రాకపోవడంతో బోర్డు ఎస్‌‌‌‌ఈ ఆర్‌‌‌‌.వి. ప్రకాశ్‌‌‌‌ అప్పటికప్పుడు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి ఘాటు లేఖ రాశారు. అక్టోబర్‌‌‌‌ 4వ తేదీ వరకు ఏపీ వాడుకున్న నీళ్ల లెక్కల్ని చెప్పాలని, ఆ డేటా ఇవ్వకుంటే తదుపరి రిలీజ్​ ఆర్డర్స్​ ఇవ్వబోమని లేఖలో పేర్కొన్నారు. లేఖపైనా ఆలస్యంగా స్పందించిన ఏపీ.. లెక్కలు చెప్పేందుకు మరో రెండు రోజుల టైం పడుతుందని బోర్డుకు సమాచారమిచ్చింది.

దొంగ లెక్కలు.. అందుకే కాలయాపన: తెలంగాణ ఇంజనీర్లు

బోర్డు మీటింగ్​లో ఏపీ అధికారుల వాదనను తెలంగాణ ఇంజనీర్లు గట్టిగా తిప్పికొట్టారు. పోతిరెడ్డిపాడు, కేసీ కెనాల్‌‌‌‌ నుంచి తీసుకున్న నీటికన్నా 27 టీఎంసీలు తక్కువగా రికార్డు చేశారని బోర్డు దృష్టికి తేగా, రెండు నుంచి ఐదు టీఎంసీలు మాత్రమే ఎక్కువగా తీసుకున్నామని ఏపీ అధికారులు వివరణ ఇచ్చారు. సముద్రంలోకి పోతున్న నీళ్లలో 21 టీఎంసీలను పులిచింతల ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు ఎత్తిపోశామన్న వాదనను కూడా తెలంగాణ ఇంజనీర్లు తప్పుపట్టారు. కృష్ణా నీళ్లను తక్కువగా వాడుకున్నట్టు దొంగ లెక్కలు చూపించి, భవిష్యత్‌‌‌‌లో ఆమేరకు మళ్లీ నీళ్లను తీసుకోవడానికి ఏపీ కుట్రలు చేస్తోందని బోర్డుకు వివరించారు. నీటి వాడకంపై ఎప్పటికప్పుడు లెక్కలు అందుబాటులో ఉన్నప్పటికీ, యుటిలైజేషన్​ డేటా ఇవ్వడానికి ఏపీ ఆఫీసర్లు రెండ్రోజుల టైమ్ కోరడమేంటని తెలంగాణ ఇంజనీర్లు ప్రశ్నించారు.