సిద్దిపేటలో కల్తీ పాల కలకలం.. పాల వ్యాపారిని నిలదీసిన స్థానికులు

సిద్దిపేటలో కల్తీ పాల కలకలం.. పాల వ్యాపారిని నిలదీసిన స్థానికులు
  • వేడి చేస్తే ప్లాస్టిక్​ను తలపించేలా నురగ
  • శాంపిల్స్​ తీసుకుని టెస్ట్​కు పంపించిన అధికారులు
  • రిపోర్టుల ఆధారంగా చర్యలుంటాయన్న ఆఫీసర్లు 

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం కల్తీ పాలు అమ్ముతున్నారని స్థానికులు ఓ పాల వ్యాపారిని నిలదీశారు. సిద్దిపేటలోని లాల్‌ కమాన్‌ ప్రాంతంలో ఓ పాల వ్యాపారి ప్రతి రోజు సుమారు రెండు, మూడు వందల లీటర్ల పాలు అమ్ముతుంటాడు. ఆ ప్రాంతంలో ఉండే చాలా మంది ఈ పాలను కొంటుంటారు. రోజు లెక్కనే ఆదివారం ఉదయం ఓ వ్యక్తి అతడి వద్ద పాలను కొన్నాడు. ఇంటికి వెళ్లి వేడి చేయగా రంగు మారింది.

నురుగు చేతిలోకి తీసుకుని చూడగా ప్లాస్టిక్‌ లా అనిపించడంతో వెంటనే పాల వ్యాపారి వద్దకు వెళ్లి నిలదీశాడు. సదరు పాల వ్యాపారి దగ్గర కొద్ది రోజులుగా పాలు కొంటున్న పట్టణానికి చెందిన ఓ డాక్టర్​కూడా వెన్న కోసం పాల నుంచి తీసిన మీగడను వేడి చేస్తే ప్లాస్టిక్‌ లాగా ఉండలు ఉండలుగా రావడంతో వాటిని ఓ ప్యాకెట్‌లో తీసుకుని వచ్చి పాల వ్యాపారిని నిలదీశాడు. క్యాన్లలో ఉన్న పాలను పక్కనే ఉన్న హోటల్‌లో వేడి చేయగా సబ్బు నురుగ వంటి నురగ రావడం, రంగు మారడంతో ప్రశ్నించారు. దీంతో పాల వ్యాపారి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో స్థానికులు మున్సిపల్‌ అధికారులకు, సిద్దిపేట టూ టౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి చేరుకున్న పోలీసు సిబ్బంది, మున్సిపల్‌ అధికారులు పాల శ్యాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని, వచ్చే రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కల్తీ పాలు అమ్మడం వల్ల చిన్న పిల్లలు, ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, ఫుడ్ ఇన్​స్పెక్టర్ ​స్పందించి కల్తీ పాలను విక్రయిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సదరు పాల వ్యాపారి సైతం పాలను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నావని అడిగితే ఒకసారి అమూల్‌ కంపెనీ నుంచి కొంటున్నానని, మరోసారి తమ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న గేదెల నుంచి తెస్తానని పొంతన లేని మాటలు చెబుతున్నాడని స్థానికులు వాపోయారు.