హెపటైటిస్​నూ తరిమేద్దాం

హెపటైటిస్​నూ తరిమేద్దాం

ప్రజల్లో అవగాహన కలిగించి, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం మొదలైతేనే హెపటైటిస్​ వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అన్నారు. వరల్డ్​ హెపటైటిస్​ డే(జులై 28)ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలో ఇండియన్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ​లివర్​ అండ్​ బైలియరీ సైన్సెస్​(ఐఎల్బీఎస్) వార్షిక ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా హెపటైటిస్ ​బి, సి వ్యాధులపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు.

కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ ​మాట్లాడుతూ.. పోలియోపై ఎలాగైతే కలిసికట్టుగా పోరాడి విజయం సాధించామో.. హెపటైటిస్​పై పోరాటంలో కూడా ప్రజలంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. పెళ్లిళ్లు, విందులు, వినోదాల్లో గొప్పలకు పోయి అతిథులకు మద్యాన్ని ఇవ్వవద్దని, హెపటైటిస్​కు లింక్​ఉన్న మద్యాన్ని ఇవ్వకుండా పార్టీల్లో కొత్త ట్రెండ్ ప్రారంభించాలని కోరారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్​ప్రసాద్​మాట్లాడుతూ.. హెపటైటిస్​ బాధితులపై వివక్ష రూపుమాపేందుకు లేదా వారికి ఉద్యోగాలను నిరాకరించకుండా ఉండేందుకు తగిన చట్టంలో సవరణలు చేయాలంటే పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.  కాగా, వైరల్ ​హెపటైటిస్ ​గురించి, ఆ వ్యాధి బాధితులపై వివక్ష తొలగించడం కోసమే ‘ఎంపవర్డ్​ పీపుల్​అగైనెస్ట్​ హెపటైటిస్​(ఎంపథీ)’ అనే వార్షిక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఎల్బీఎస్ ప్రతినిధులు తెలిపారు. భారతదేశంలో 6 కోట్ల మంది హెపటైటిస్​బాధితులు ఉన్నారని, ఏటా 1.5 లక్షల మంది దీనివల్ల
చనిపోతున్నారని చెప్పారు.