ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం సూర్జాపూర్లో ఈ నెల 20 రాత్రి రాచర్ల అనిల్ కుమార్ అలియాస్ తిరుమలేశ్ (23) ను హత్య చేసిన నలుగురిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కేసు వివరాలను నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. సూర్జాపూర్ గ్రామానికి చెందిన గాజుల నాగరాజు కూతురిని లవ్ చేయాలంటూ కొంతకాలంగా తిరుమలేశ్ వేధింపులకు గురిచేశాడని, ఈ విషయం తెలిసి నాగరాజు, ఆయన చిన్నాన్నలు గాజుల రాజన్న, గాజుల గంగన్న తిరుమలేశ్ మందలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయిన అతనిలో మార్పు రాకపోవడంతో దాడి చేశారని, తిరుమలేశ్ తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదయ్యిందన్నారు. తమ కూతురిని వేధించడమే కాకుండా తమపైనే పోలీసులకు కంప్లైంట్ చేశాడన్న కోపంతో నాగరాజు, గాజుల రాజన్న, గాజుల గంగన్నలతో పాటు మరో సమీప బంధువు, నేవీ ఉద్యోగి గాజుల నవీన్ ఈ నెల 20న తిరుమలేశ్ను ఇంటి నుంచి బయటకు తీసుకు వెళ్లారని, చౌరస్తా వద్దకు తీసుకు వచ్చి, అతన్ని కట్టేసి గొడ్డలితో తలపై దాడి చేశారని, చితకబాది పారిపోయారని వివరించారు. తీవ్రంగా గాయపడిన తిరుమలేశ్ను ఖానాపూర్కు, అక్కడి నుంచి నిర్మల్ కు తీసుకెళ్లారని, చికిత్స పొందుతూ చనిపోయడని చెప్పారు. మృతుని తల్లి రాచర్ల లక్ష్మీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్టు, నిందితులు గాజుల నాగరాజు, గాజుల రాజన్న, గాజుల గంగన్న, గాజుల నవీన్ మెట్ పల్లి నుంచి వస్తుండగా బాదనకుర్తి చెక్ పోస్టు వద్ద పట్టుకున్నట్టు తెలిపారు. సీఐ అజయ్ బాబు, ఎస్ ఐ రాము నాయక్ ఉన్నారు.
