నిమ్స్ లో చిన్నారికి అరుదైన ఆపరేషన్

నిమ్స్ లో చిన్నారికి అరుదైన ఆపరేషన్
  • లివర్ క్యాన్సర్ చికిత్సను సక్సెస్ చేసిన డాక్టర్లు

పంజాగుట్ట, వెలుగు: ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతుండగా..నిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. నల్లగొండ జిల్లా గుర్రం పోడు మండలం కొప్పోల్ కు చెందిన బాల విజయ్, లావణ్య దంపతులకు సత్యశ్రీ  ఏడాదిన్నర కుమార్తె ఉంది. ఆరు నెలల కిందట పాప ఆడుకుంటూ పడిపోయింది. ఏడుపు ఆపకపోతుండడంతో తల్లిదండ్రులు ఏమైందో ఏమోనని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా నిమ్స్ కు రెఫర్ చేశారు.

అక్కడ స్కానింగ్ చేసి చిన్నారి లివర్ కు క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారు. గత నెలలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగర బీరప్ప పర్యవేక్షణలో ఆపరేషన్ చేసి క్యాన్సర్ భాగాన్ని తొలగించారు. అనంతరం 15 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచారు. పాప ఆరోగ్యంగా ఉండడంతో బుధవారం మీడియాకు డాక్టర్లు ఆపరేషన్ చేసిన తీరును వివరించారు. ఇలాంటి అరుదైన వ్యాధి వస్తే ఆపరేషన్ చేయడం కష్టమేనని డాక్టర్లు పేర్కొన్నారు.