తెలంగాణ సర్కార్ ఖజానాకు శాలరీ సెగ తగులుతోంది. పదేళ్ల కిందట ఉన్న పరిస్థితికి, ఇప్పటికీ నక్కకు లోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నెలకు రూ.15వందల కోట్లుగా ఉన్న జీతాలు, పెన్షన్ల ఖర్చు.. ఇప్పుడు ఏకంగా రూ.6వేల కోట్లకు చేరింది. అంటే గడచిన 10 ఏళ్ల కాలంలో ఖర్చులు 300 శాతం పెరగటం గమనార్హం. దీనిపై సీఎస్ రామకృష్ణారావు వెల్లడించిన లెక్కలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
స్వీపర్ జీతం రూ.2 లక్షలా..?
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే భారీ జీతాలు ఉంటాయని తెలుసు కానీ.. విద్యుత్ శాఖలో ఉద్యోగులకు అందుతున్న జీతాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అక్కడ పని చేసే సీనియర్ క్లాస్-IV ఉద్యోగులు అంటే స్వీపర్లకు కూడా నెలకు దాదాపు రూ.2 లక్షల జీతం అందుకుంటున్నారు. ఇక చీఫ్ ఇంజనీర్ల జీతాలైతే నెలకు రూ.7 లక్షల వరకు ఉన్నాయి. ఇది రాష్ట్ర గవర్నర్ లేదా టాప్ ఐఏఎస్ అధికారుల జీతం కంటే కూడా ఎక్కువేనని సమాచారం.
మున్సిపల్ డ్రైవర్లకూ 'లక్ష'కు పైనే..
కేవలం విద్యుత్ శాఖలోనే కాదు.. మున్సిపల్ శాఖలోనూ జీతాల మోత గట్టిగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో రెగ్యులరైజ్ అయిన శానిటేషన్ వర్కర్లు సగటున రూ.70 వేలు అందుకుంటున్నారు. 30 ఏళ్ల సర్వీస్ ఉన్న డ్రైవర్లు, శానిటేషన్ సిబ్బందికి లక్ష రూపాయలకు పైగా జీతం అందుతోందట. ప్రతి నాలుగు ఏళ్లకోసారి జరుగుతున్న పే-రివిజన్లు, ఎన్నికల హామీలు ఈ స్థాయి జీతాలకు కారణమని తెలుస్తోంది.
అందుకే 'ప్రభుత్వ ఉద్యోగ' క్రేజ్
జీతాలు ఈ రేంజ్‌లో ఉన్నాయి కాబట్టే.. నోటిఫికేషన్ పడగానే నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఎగబడుతున్నారు. మొన్నటి గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ఒక్కో పోస్టుకు ఏకంగా 799 మంది పోటీ పడ్డారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ, ప్రాణం పెట్టి చదువుతున్నారంటే.. ఆ వెనుక ఉన్న ఆకర్షణ ఈ భారీ శాలరీలే.
80 శాతం ఖర్చు వాటికే..
గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.15 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.12 లక్షల కోట్లు అంటే 80 శాతం సొమ్మును కేవలం జీతాలు, పెన్షన్లు, చేసిన అప్పుల కిస్తీలకే సరిపోయింది. ఇక మిగిలిన రూ.3 లక్షల కోట్లు అంటే 20 శాతం మాత్రమే ఆస్తుల కల్పన, అభివృద్ధి పనులకు గత తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందట.
జీతాల భారం ఇంతలా పెరుగుతున్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని సీఎస్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ 11 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోందని, డిజిటల్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు రైతు బంధు కోసం రూ.7వేల కోట్లు పంపిణీ చేస్తే, అందులో తప్పులు కేవలం 6 శాతం మాత్రమే ఉన్నాయని వివరించారు. మెుత్తానికి పెరుగుతున్న జీతాలు ఉద్యోగులకు సంతోషాన్నిస్తున్నప్పటికీ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం మరిన్ని నిధులు అభివృద్ధి వైపు మళ్లించాల్సిన అవసరం ఉందనేది నిపుణుల మాట.
