భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రూ. 2 కోట్ల విలువైన గంజాయిని గురువారం భద్రాద్రికొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. గంజాయి పట్టివేత వివరాలను గురువారం చుంచుపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఏపీలోని చిత్తూరు నుంచి ఓ కంటెయినర్‌లో కొబ్బరి పీచు పదార్థాలతో కలిపి గంజాయిని లోడ్ చేసుకొని నాసిక్‌కు తరలిస్తున్నారు. జిల్లా టాస్క్‌ఫోర్స్, చుంచుపల్లి పోలీసులు స్థానికంగా వాహనాల తనిఖీ చేపడుతుండగా.. అటు వైపు వచ్చిన కంటెయినర్‌ను తనిఖీ చేయడంతో గంజాయి కనిపించింది.
కొబ్బరి పీచు బండిల్స్ మధ్యలో రూ. 2 కోట్ల విలువైన 408 కిలోల గంజాయి బండిల్స్ ఉన్నట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రలోని బెల్గావ్ గ్రామానికి చెందిన సూర్యవంశీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ ఉమర్, ఒడిశాకు చెందిన దేబ్రత చక్రవర్తి, నరత్తం రాయ్‌లను అరెస్ట్ చేయడంతో పాటు కంటెయినర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయిని పట్టుకున్న సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, రవికుమార్, ఉమను ఎస్పీ అభినందించారు.
