- దుర్గం చెరువులో 6, హుస్సేన్ సాగర్‌లో 2 బోట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం
- కుటుంబంతో బస చేసేలా డబుల్ బెడ్రూం సౌకర్యం
- నిర్వహణ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే దానిపై ఆలోచనలు
- త్వరలోనే టెండర్ల ప్రక్రియ షురూ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ వాసులకు, పర్యాటకులకు టూరిజంలో కొత్త అనుభూతిని పంచేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా హౌస్ బోట్లను అందుబాటులోకి తేచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. కేరళ తరహాలో జలాశయాల మధ్య విహరిస్తూ అక్కడే బస చేసేలా హౌస్ బోట్లను తీసుకురానుంది. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దుర్గం చెరువు, హుస్సేన్ సాగర్‌లను ఎంపిక చేయగా, ఇప్పటికే అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ మధ్య కాలంలో వీకెండ్స్, సాయంత్రం వేళల్లో కుటుంబంతో గడిపేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు.
జనాల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని, పర్యాటక శాఖ హౌస్ బోట్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దుర్గం చెరువులో 6, హుస్సేన్ సాగర్‌లో ప్రయోగాత్మకంగా 2 బోట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిహౌస్ బోటులో రెండు డబుల్ బెడ్రూంలు ఉంటాయి. కుటుంబంతో కలిసి బోటులో ప్రయాణించడంతో పాటు రాత్రి వేళ అందులోనే బస చేసే వెసులుబాటు ఉంటుంది. పర్యాటకులకు అవసరమైన ఆహారం, మౌలిక వసతులతో పాటు బోట్లలోనే క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
పీపీపీ పద్ధతిలో నిర్వహణ..
హౌస్ బోట్ల నిర్వహణ, ఆదాయ మార్గాలపై పర్యాటక శాఖ అధికారులు వివిధ అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వమే నిర్వహించాలా? లేక ప్రైవేటు పెట్టుబడిదారులకు (పీపీపీ మోడల్) అప్పగించాలా? అనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆదాయం ఏ రీతిలో ఉంటుందనేది పరిశీలిస్తున్నారు.
నిర్వహణ బాధ్యతలు తీసుకునే సంస్థే బోట్లను తయారు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలా? లేక గోవా వంటి ప్రాంతాల్లో తయారీ చేయించి ఇక్కడికి రప్పించాలా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే వీటికి సంబంధించిన టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.
మరో 9 చోట్ల కొత్త బోట్లు..
రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లోని నదులు, సరస్సుల్లో ప్రస్తుతం 99 బోట్లు నడుస్తున్నాయి. పర్యాటకుల రద్దీ దృష్ట్యా మరో 9 ప్రాంతాల్లో కొత్తగా బోట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
పరిగి, జొన్నలబొగూడ, వార్దవెల్లి, రాయిగిరి, పర్ణశాల, భద్రాచలం, బోరంచ, నిజాంసాగర్ ప్రాంతాల్లో బోట్ల ఏర్పాటుకు డిమాండ్ ఉండటంతో పర్యాటక శాఖ నివేదికలు పంపగా.. ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టులతో పర్యాటక శాఖ ఆదాయం పెరగడంతో పాటు దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆఫీసర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బోటింగ్‌తోనే రూ.13 కోట్ల ఆదాయం..
పర్యాటక శాఖకు బోటింగ్ ద్వారా భారీ ఆదాయం సమకూరుతున్నది. గతేడాది కేవలం బోటింగ్ ద్వారానే సర్కార్ ఖజానాకు రూ.13 కోట్ల ఆదాయం వచ్చింది. సౌకర్యాలను మరింత పెంచితే ఆదాయం డబుల్ అవుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. అందుకే రామప్పలో ఫ్లోటింగ్ రెస్టారెంట్, దుర్గం చెరువు, సాగర్‌లో హౌస్ బోట్ల వంటి కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటివరకు కేరళ, కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లోనే చూసిన హౌస్ బోట్లు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఇప్పుడు మన దగ్గర కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. వీటి ద్వారా నీళ్లపై తేలుతూనే డిన్నర్లు చేయొచ్చు. బర్త్‌డేలు, చిన్నచిన్న గెట్ టు గెదర్ పార్టీలు చేసుకునేలా డిజైన్ చేస్తున్నారు.
