మన చుట్టూ స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చేవాళ్లు, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చని చెప్పేవాళ్లు వేల సంఖ్యలో కనిపిస్తుంటారు. కానీ తరతరాలుగా నిలకడగా సంపదను సృష్టించడంలో మార్వాడీల స్టైలే వేరు. వారు చేసేది రాకెట్ సైన్స్ కాదు.. కేవలం ఒక పద్ధతి ప్రకారం సాగే క్రమశిక్షణ. మార్వాడీల ఇన్వెస్టింగ్ రహస్యాలను 7 సూత్రాల గురించి చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ బయటపెట్టారు. మార్వాడీలకు సంపదను సృష్టించిపెడుతున్న నిజమైన ఆర్థిక పాఠాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ముందు పునాది.. తర్వాతే మేడ
చాలామంది ఇన్వెస్టర్లు "ఎంత లాభం వస్తుంది?" అని ఆలోచిస్తారు. కానీ మార్వాడీలు మాత్రం తమ అసలు భద్రంగా ఉందా? లేదా అని ఆలోచిస్తారట. వ్యాపార లాభాలను, ఇంటి ఖర్చులను ఎప్పుడూ కలపరు. ఎమర్జెన్సీ ఫండ్ చేతిలో ఉన్నాకే రిస్క్ తీసుకుంటారు. అంటే మార్కెట్ పడిపోయినా వారి లైఫ్ స్టైల్ దెబ్బతినదు.
2. ఆస్తులతో ప్రేమలో పడకండి
కొంతమంది ఒక స్టాక్ కొంటే అది నష్టాల్లో ఉన్నా సెంటిమెంట్‌తో వదలరు. కానీ మార్వాడీలు ఆస్తుల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఒక షేరు లేదా ప్రాపర్టీ ఆశించిన లాభం ఇవ్వడం లేదని తెలిస్తే.. ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే.. సైలెంట్‌గా అమ్మేసి బయటకు వచ్చేస్తారు. వారికి లాభమే ముఖ్యం, సెంటిమెంట్ కాదు.
3. 'క్యాష్' ఉంటేనే కింగ్
మార్కెట్ ఎప్పుడూ ఇన్వెస్ట్ చేసే ఉండాలని చాలామంది అంటారు. కానీ మార్వాడీలు తమ పోర్ట్‌ఫోలియోలో 15 నుంచి 25 శాతం క్యాష్ చేతిలో లిక్విడ్ గా ఉంచుతారు. ఇది బద్ధకం కాదు, ఒక వ్యూహం. మార్కెట్ భారీగా పడినప్పుడు.. అందరూ భయంతో అమ్ముతుంటే వారు తమ దగ్గరున్న డబ్బుతో చౌకగా ఆస్తులను కొనేస్తారు.
4. నిదానంతోనే గెలుపు
రాత్రికి రాత్రే డబ్బులు డబుల్ అవ్వాలని మార్వాడీలు కోరుకోరు. ఏడాదికి 12-15% లాభం వచ్చినా చాలు.. దాన్ని 20-30 ఏళ్ల పాటు కొనసాగిస్తే వచ్చే కాంపౌండింగ్ పవర్ వారికి తెలుసు. సంపద అనేది ఒక మెరుపు తీగలా కాకుండా.. మర్రి చెట్టులా పెరగాలని వారు నమ్ముతారు. అందుకే ఫాస్ట్ మనీ కంటే స్లో అండ్ స్టడీ మనీ అనే సూత్రాన్ని వారు నమ్ముకుంటారు.
5. రియల్ ఎస్టేట్ అంటే 'అద్దె' రావాల్సిందే
కేవలం ధర పెరుగుతుందని భూములు కొనడం మార్వాడీ స్టైల్ కాదు. కొన్న ఆస్తి నుండి నెలనెలా అద్దె రావాలి. అలాగే దాన్ని కనీసం పదేళ్లు ఉంచుకునే ఓపిక ఉండాలి. అప్పులు చేసి రియల్ ఎస్టేట్‌లో ఆడటం వారికి నచ్చని పని.
6. ఆదాయం పెరిగినా.. ఖర్చు పెంచొద్దు
జీతం పెరగగానే కొత్త ఐఫోన్ లేదా ఖరీదైన కారు కొనడం మధ్యతరగతి బలహీనత. కానీ మార్వాడీలు ముందు ఆస్తులను పెంచుకుంటారు. ఆ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో లగ్జరీ వస్తువులను కొంటారు. ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉండటమే వారి సంపదకు అసలైన సీక్రెట్.
7. ఇన్వెస్ట్‌మెంట్ అంటే 'బోరింగ్' గా ఉండాలి
రోజూ పోర్ట్‌ఫోలియో చూసుకోవడం.. గంట గంటకూ ట్రేడింగ్ చేయడం సంపదను సృష్టించదు. ఒక పద్ధతిని సెట్ చేసుకుని, ఏళ్ల తరబడి నిశ్శబ్దంగా దాన్ని పాటించడమే మార్వాడీల విజయ రహస్యం. ఎక్కడైతే ఆవేశం ఉండదో.. అక్కడే సంపద ఉంటుంది. డబ్బు సంపాదించడం అనేది కేవలం అంకెలకు సంబంధించింది కాదు, అది మన ప్రవర్తనకు సంబంధించింది. ఈ 7 సూత్రాలను పాటిస్తే ఎవరైనా సరే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని సీఏ వెల్లడించారు.
