అక్రె డిటేషన్‌‌‌‌ పాలసీపై కౌంటర్లు దాఖలు చేయండి : హైకోర్టు

అక్రె డిటేషన్‌‌‌‌ పాలసీపై కౌంటర్లు దాఖలు చేయండి : హైకోర్టు
  •     ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ మీడియా అక్రెడిటేషన్‌‌‌‌ పాలసీపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రెడిటేషన్‌‌‌‌ పాలసీ విధి విధానాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్‌‌‌‌కు నోటీసులు జారీ చేసింది. 

విచారణను ఏప్రిల్‌‌‌‌ 8కి వాయిదా వేసింది. అక్రెడిటేషన్‌‌‌‌ జారీకి అర్హతలపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 22ను సవాల్ చేస్తూ హైటెక్‌‌‌‌ ప్రింట్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎలక్ట్రానిక్‌‌‌‌ మీడియా అసోసియేషన్, తెలంగాణ ఉర్దూ వర్కింగ్‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌లపై చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌‌‌లతో కూడిన బెంచ్‌‌‌‌ గురువారం విచారణ చేపట్టింది. 

ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..ప్రస్తుతం అమలులో ఉన్న అక్రెడిటేషన్‌‌‌‌ కార్డుల గడువు ఈనెల 28తో ముగుస్తున్నదని తెలిపారు. ఈ  నేపథ్యంలో వాటి చెల్లుబాటును మరో రెండు నెలలు పొడిగించినట్లు చెప్పారు. కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. వాదనలను విన్న బెంచ్‌‌‌‌.. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, దానిపై 2 వారాల్లో రిప్లయ్‌‌‌‌ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.