- రెవెన్యూ సదస్సుల అప్లికేషన్లపై చర్యలేవి ?
- మాజీమంత్రి హరీశ్‌రావు మండిపాటు
సిద్దిపేట, వెలుగు : ‘రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి రాజ్యం ఏలుతోంది, మంత్రి పేషీ నుంచి తహసీల్దారు ఆఫీస్ వరకు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయంపై సీఎం, రెవెన్యూ మంత్రులు సమీక్ష చేయాలి’ మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ ఆఫీస్‌లో సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ ఆఫీసర్లు తరచూ ఏసీబీకి పట్టుబడుతుండడం చూస్తుంటే ఆ శాఖలో అవినీతి ఎలా పెరిగిందో అర్థం అవుతుందన్నారు. రెవెన్యూ మంత్రి కుమారుడే భూకబ్జాలకు పాల్పడుతుంటే అతడిపై కేసులు పెట్టాల్సింది పోయి..
భూమిని కాపాడిన సీఐనే బదిలీ చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించి 8.60 లక్షల అప్లికేషన్లు తీసుకున్న ప్రభుత్వం.. వాటిలో ఎన్నింటిని క్లియర్ చేసిందని ప్రశ్నించారు. ధరణి స్థానంలో భూభారతి తెచ్చామని ఆర్భాటంగా చెప్పుకున్న ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్లు పూర్తై ఆరు నెలలు గడుస్తున్నా పట్టాదాస్ పాస్‌బుక్స్ ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్లు పూర్తి కాగానే పాస్ బుక్కులు ఇంటికే వస్తే.. ఇప్పుడు వాటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. సాదాబైనామాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రజలకు తెలియకుండానే వారి భూములను నిషేధిత జాబితాలో పెడుతుండడంతో పిల్లల పెండ్లిళ్లు, చదువులు, వైద్యం వంటి అత్యవసరాలకు కూడా భూములు అమ్ముకోలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితం అని చెప్పిన కాంగ్రెస్ నేతలు... అధికారంలోకి వచ్చాక ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రజల ముక్కుపిండి డబ్బులు వసూలు చేశారన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల పక్షాన ప్రతి సమస్యను లేవనెత్తుతామని చెప్పారు. సమావేశంలో నాయకులు కె.రాజనర్సు, మారెడ్డి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
