పైపైకి ఎదుగుతున్నం

పైపైకి ఎదుగుతున్నం

ఆర్థిక వ్యవస్థలో ఎన్నో అంశాలుంటాయి.  ఒక దేశానికి రకరకాల వనరుల ద్వారా  ఆదాయం వస్తుంటుంది. దాన్ని దేశ అవసరాల కోసం వాడుతూ,  మరోపక్క దేశాన్ని అభివృద్ధి చేస్తూ.. అలాగే ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలి.  ఎగుమతులు చేస్తూ.. అంతర్జాతీయ నిధులు కూడా సమకూర్చుకోవాలి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో ఉంటుంది . అయితే ఈ 75 ఏండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేసింది. ఎక్కువ జనాభా ఉండే దేశాల్లో ఆర్థిక అసమానతలు పెద్ద సవాళ్లుగా మారతాయి. సంక్షోభాలు కూడా తలెత్తుతాయి. అలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆర్థిక సుస్థిరత సాధించడమే కాకుండా ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతోంది.

ఫుడ్ ప్రొడక్షన్
మనిషికి కావాల్సిన ప్రాథమిక వనరుల్లో ఆహారం మొదటిది. ఇంట్లో తినడానికి కావాల్సిన సరుకులన్నీ ఉంటే  జేబులో డబ్బులు లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. దేశానికి కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆహార నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆర్థిక వ్యవస్థలో ఆటు, పోట్లు ఎదురైనా.. ఆహార నిల్వలుంటే దేశంలో ఆకలి చావులు లేకుండా చూసుకోవచ్చు. అందుకే ఇండియా ఆహార నిల్వలకు పెద్దపీట వేసింది. ఒకవేళ సంక్షోభం ఎదురైనా దేశానికి కొన్ని నెలల పాటు సరిపడా ఆహారం ఉండేలా ఆహార  ధాన్యాలను నిల్వ చేస్తోంది. అంతేకాదు అవసరం కంటే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ  మిగులును విదేశాలకు ఎగుమతి చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో 54.92 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ఉత్పత్తి 2020-–21లో 305.44 మిలియన్ టన్నులకు పెరిగింది.  ఈ 75 ఏండ్లలో దేశంలో ఆహార కొరత ఏర్పడకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. 

జీడీపీ
ఒక దేశ ఆర్థికవ్యవస్థ బాగుందో లేదో జీడీపీ తెలుపుతుంది. ఇది  స్టూడెంట్ మార్క్స్​లిస్ట్ లాంటిది.  సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమై ఉన్న వివిధ రంగాలు, అంశాల బలాలు, బలహీనతలను జీడీపీ ద్వారా తెలుసుకోవచ్చు.  జీడీపీ వృద్ధి చెందుతుందంటే దానర్థం దేశ ఆర్థికవిధానాలు  సరైన దిశలో వెళ్తున్నాయని. భారత్ వంటి అల్పాదాయ, మధ్యాదాయ దేశాలు.. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ఏటా అధిక జీడీపీ సాధించడం ముఖ్యం. అయితే కొవిడ్, రష్యా వార్ వంటి కారణాల వల్ల ప్రస్తుతం ఇండియన్ ఎకానమీ గ్రాఫ్ తగ్గినప్పటికీ  తిరిగి రికవరీకి సిద్ధంగా ఉందని ఆర్ధికవేత్తలు, నిపుణులు అంటున్నారు. అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉన్న గ్రాఫ్‌‌ను చూస్తే జీడీపీ విషయంలో ఇండియా చాలా గ్రోత్ సాధించింది. 1947లో 2.7లక్షల కోట్లు ఉన్న ఇండియా జీడీపీ ఇప్పుడు 135 లక్షల కోట్లకు పెరిగింది.  ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న లార్జెస్ట్ ఎకానమీల్లో  భారత్ ఆరవ స్థానంలో ఉంది.  2031 కల్లా మూడవ స్థానానికి చేరుతుందని ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా’ అంటోంది

హెల్త్ కేర్
ఆరోగ్య రంగంలో గత 75 ఏండ్లలో స్వతంత్ర భారత్ ఎన్నో  విజయాలు సాధించింది.  బ్రిటిష్‌‌ కాలంలో 1885 నాటికి  ఆస్పత్రులు, డిస్పెన్సరీల సంఖ్య 1250 ఉంటే స్వాతంత్య్రం వచ్చేనాటికి వీటి సంఖ్య 7,400కు పెరిగింది.  అయితే బ్రిటిష్‌‌  ప్రభుత్వం ఆరోగ్యానికి చాలా తక్కువ నిధులు కేటాయించేది. స్వాతంత్ర్యం తర్వాత  పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆరోగ్య రంగ అభివృద్ధికి తగిన సూచనలు చేయాలని 1959లో మొదలియార్‌‌ కమిటీని నియమించింది అప్పటి ప్రభుత్వం. మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో ఆరోగ్య రంగంలో పెద్ద పురోగతి లేదు.  ఆర్థిక సంస్కరణల తర్వాత నుంచి రాష్ట్రాలకు ప్రాముఖ్యం పెరిగింది. ఆరోగ్య రంగానికి నిధులు, వసతుల విషయమై రాష్ట్రాలు నేరుగా ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలతో సంప్రదించడానికి వెసులుబాటు లభించింది. స్వతంత్ర భారతంలో తొలిసారిగా 1983లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించారు. తదుపరి పంచవర్ష ప్రణాళికలన్నింటిలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మూడు దశాబ్దాల్లో ఆరోగ్య సేవల రంగం గణనీయంగా మార్పు చెందింది. మన శాస్త్రవేత్తలు మశూచి, ప్లేగు వ్యాధులను నిర్మూలించగలిగారు. కలరా మరణాలను తగ్గించి, మలేరియాను అదుపులోకి తీసుకొచ్చారు. మరణాల రేటు 27.4 శాతం నుంచి 14.8 శాతానికి తగ్గింది. సగటు జీవితకాలం 34.7 ఏండ్ల నుంచి 54 ఏండ్లకు పెరిగింది.
భారతదేశంలో అలోపతికి తోడు ఆయుర్వేద, యోగ, సిద్ధ, యునాని, హోమియోపతి, ప్రకృతి చికిత్స వంటి దేశీయ ఆరోగ్య సంరక్షణ పద్ధతులు కూడా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు ప్రజారోగ్య పథకాలను అమలు చేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్‌‌(ఎన్‌‌హెచ్‌‌ఎం)లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ గ్రామీణ, పట్టణారోగ్య పథకాలను అమలు చేస్తున్నాయి. ఎన్‌‌హెచ్‌‌ఎం కింద 2018లో ఆయుష్మాన్‌‌ భారత్‌‌ పథకాన్ని చేపట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వెల్‌‌నెస్‌‌ సెంటర్లను విస్తరిస్తున్నారు. కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందిస్తున్నారు. గడచిన 75 ఏండ్లలో దేశంలో మరణాల రేటు, జననాల రేటు గణనీయంగా తగ్గాయి. తల్లులు, పిల్లల ఆరోగ్య రక్షణకు, పోషణకు ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల మాతాశిశు మరణాలు తగ్గిపోయాయి. 2014లో మనదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. 2025 కల్లా క్షయ వ్యాధిని నిర్మూలించడమే ప్రస్తుతం ఇండియా ముందున్న టార్గెట్.

మాన్యుఫాక్చరింగ్
తయారీ అనేది ఆర్థిక వ్యవస్థకు పునాది. అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికి అయినా బలమైన ఉత్పాదక రంగం ఎంతో అవసరం. అందుకే తయారీ రంగానికి భారత్ మొదటి నుంచీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక  విధానాలను అనుసరిస్తోంది. 1948లో వచ్చిన పారిశ్రామిక విధానంలో  అణుశక్తి, రైల్వే, ఆయుధ సామాగ్రి, బొగ్గు, ఇనుము, ఉక్కు, ఖనిజ, నూనెలు లాంటి కీలక పరిశ్రమలను  ప్రభుత్వం అధీనంలో ఉంచి, మిగిలిన  పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రైవేట్‌‌ రంగానికి అనుమతిచ్చారు. ఆ తర్వాత 1956లో వచ్చిన విధానంతో తయారీ వ్యవస్థలో సమూలమైన మార్పులొచ్చాయి. కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్య హోదా కల్పించారు.  వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి తగిన ప్రోత్సాహకాలు అందించడం, యూనివర్సిటీల్లో పారిశ్రామిక శ్రామికులకు ఉపయోగపడే ప్రత్యేక కోర్సులు ఏర్పాటు చేయడం,  ప్రభుత్వ, ప్రైవేట్‌‌ యూనిట్ల మేనేజర్లకు సాంకేతిక, యాజమాన్య శిక్షణ ఇవ్వడం లాంటి మార్పులతో తయారీ రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది.  ఈ విధానం పారిశ్రామిక విస్తరణకు దోహదపడింది. అందుకే 1956 పారిశ్రామిక విధానాన్ని ‘ఆర్థిక రాజ్యాంగం’ గా పరిగణిస్తారు.  ఆ తర్వాత ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు 1991లో విధించిన షరతుల మేరకు పీవీ నరసింహారావు ప్రభుత్వం సరికొత్త  పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలిపేందుకు సరళీకరణ చర్యలు చేపట్టారు. దానివల్ల మాన్యుఫాక్చరింగ్ రంగం మరింత వృద్ధి చెందింది. గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచ పెట్టుబడులను కూడా ఆకర్షించగలుగుతోంది. ఐక్యరాజ్యసమితి సంస్థ– యూఎన్‌‌సీటీఏడీ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌‌డీఐ) ఆకర్షించే దేశాల జాబితాలో మనదేశం కూడా ఉంది.  తయారీ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు ఇంజన్‌‌గా మార్చడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ జీడీపీకి తయారీ రంగం.. 25% వాటా అందించేలా చూడడమే ఇండియా టార్గెట్.

బ్యాంకింగ్
స్వాతంత్ర్యం తర్వాత భారత బ్యాంకింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్పులొచ్చాయి. బ్రిటిష్‌‌ పాలనలో బెంగాల్‌‌, బాంబే, మద్రాసు ప్రెసిడెన్సీలకు వేర్వేరు బ్యాంకులు ఉండేవి. తర్వాత ఈ మూడింటినీ విలీనం చేసి ‘ఇంపీరియల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా’గా  మార్చారు. 1935లో రిజర్వ్ బ్యాంకు ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం డిపాజిట్ల విలువ రూ.962 కోట్లు. అవన్నీ ప్రైవేటు బ్యాంకులే. అప్పటి బ్యాంకులు కేవలం సంపన్నులకు మాత్రమే  రుణాలిచ్చేవి. స్వాతంత్ర్యం తర్వాత 1949లో బ్యాంకింగ్‌‌ రంగ నియంత్రణ చట్టం చేయడంతోపాటు రిజర్వ్ బ్యాంకును కూడా జాతీయం చేశారు. బ్యాంకులను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చి- పేదరిక నిర్మూలనకు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి సాధనాలుగా ఉపయోగించారు. ఆ తర్వాత దేశంలోని  సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల విలీన ప్రక్రియ మొదలైంది. పది పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు నాలుగు బ్యాంకులుగా విలీనమయ్యాయి. ప్రస్తుతం దేశంలో12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, 22 ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, 43 రీజనల్ రూరల్ బ్యాంకులు, పలు కో ఆపరేటివ్ బ్యాంకులు,  స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల ఏటీఎంలు ఉన్నాయి. 

ట్రాన్స్‌‌పోర్ట్
స్వాతంత్ర్యానికి ముందు, భారత రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు.  గ్రామాలను,   నగరాలకు అనుసంధానించే రోడ్లు అప్పట్లో ఉండేవి కావు. వలస సమస్యకు కారణం కూడా ఇదే. అయితే స్వాతంత్ర్యం తర్వాత ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోడ్డు, రైలు రవాణా మార్గాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
రైల్వే: భారతదేశంలో రైలు మార్గం 1853లో లార్డ్ డల్హౌసి గవర్నర్ జనరల్‌‌గా ఉన్న కాలంలోనే మొదలైంది.  ఆ సంవత్సరంలోనే బొంబాయి, థానే మధ్య 34 కిలోమీటర్ల  మొట్టమొదటి రైల్వేలైన్‌‌ ప్రారంభించారు.1950లో దేశంలోని మొత్తం రైల్వే లైన్ల పొడవు 53,596 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడది  67,956 కిలోమీటర్లకు పెరిగింది. భారతదేశంలో రైల్వే రంగం అతి పెద్ద ప్రభుత్వరంగ వ్యవస్థగా ఉంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ - భారతీయ రైల్వే. ఇందులో సుమారు 14 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా, ప్రపంచంలో నాలుగో పెద్ద వ్యవస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,025 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బ్రిటిష్ వారు మొదలుపెట్టిన రైల్వే వ్యవస్థను భారత్ సరిగ్గా ఉపయోగించుకుంటూ, తగిన మార్పులు చేస్తూ  రైల్వే రంగంలో మెరుగైన ప్రగతిని సాధించింది. రైల్వే కోసం ఏటా బడ్జెట్‌‌లో పెద్దమొత్తాన్ని కేటాయిస్తారు. మొన్నటి బడ్జెట్‌‌లో రైల్వే శాఖకు 1,40,367 కోట్లు కేటాయించారు. రోడ్: భారతదేశం రోడ్డు రవాణా, రోడ్ల పొడవుకు సంబంధించి ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశంలోని రోడ్ల పొడవు 1951లో కేవలం 4 లక్షల కి.మీ. మాత్రమే.  ప్రస్తుతం అది 33 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. రోడ్ల ద్వారా సరకు రవాణా 1951 నుంచి 2009 మధ్యకాలంలో దాదాపు వంద రెట్లు పెరిగింది. ప్రయాణీకుల రవాణా దాదాపు 200 రెట్లు, వాహనాల సంఖ్య 300 రెట్లు పెరిగింది. దీన్ని బట్టి రోడ్డు రవాణా అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. మొన్నటి బడ్జెట్‌‌లో రోడ్ ట్రాన్స్‌‌పోర్ట్ కోసం 1,34,015 కోట్లు కేటాయించారు. వీటితో పాటు జల, వాయు రవాణాలో కూడా ఇండియా ఎంతో వృద్ధి చెందింది. భారతదేశంలో ప్రస్తుతం 12 ప్రధాన, 187 మధ్యస్థ, చిన్న ఓడరేవులు ఉన్నాయి. ‘ఎయిర్‌‌‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ కింద 137 విమానాశ్రయాలున్నాయి.

టెలికాం
దేశంలో 1980ల నుంచే టెలిఫోన్‌‌లు ఉన్నాయి.  కానీ, 1991 ఆర్థిక సంస్కరణలతో టెలికామ్ రంగం రూపురేఖలు మారిపోయాయి. 1991కి ముందు ఇంట్లో టెలిఫోన్ ఉండటం ఒక విలాసంగా భావించేవారు. ఫోన్ చేసుకోవాలంటే పబ్లిక్ టెలిఫోన్ బూత్‌‌ల దగ్గర జనం ‘క్యూ’ కట్టాల్సి వచ్చేది. కొత్త ఆర్థిక విధానాల కారణంగా టెలికాం రంగ పరికరాల ఉత్పత్తి ప్రారంభమైంది. 1992లో అనేక సర్వీసుల్లో ప్రైవేట్ సంస్థలను కూడా అనుమతించారు. అలా దేశంలో కోట్లాది మంది ప్రజలకు మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు రంగంలోకి పెట్టుబడులు రావడంతో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ వాడే వారి సంఖ్య పెరగడం ప్రారంభమైంది. విదేశీ కంపెనీలు కూడా భారతీయ మార్కెట్లోకి అడుగు పెట్టాయి.
1994లో దేశపు మొట్టమొదటి జాతీయ టెలికమ్యూనికేషన్ పాలసీ ప్రకటించింది ప్రభుత్వం. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత పెరిగింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)1997లో ఏర్పడింది. సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగి ఇండియాలో మొబైల్ విప్లవం ప్రారంభమైంది. 1999లో  రెండవ జాతీయ టెలీకమ్యూనికేషన్ పాలసీ వచ్చింది. ఆ తర్వాత టెలికాం రంగంలో థర్డ్ జనరేషన్ కనిపించింది. ఆ తర్వాత జియో రాకతో భారత టెలికాం రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా వరకూ టెలికాం ఆపరేటర్‌‌‌‌లు విలీన ప్రక్రియలను ప్రారంభించాయి. ప్రస్తుతం100 కోట్ల మంది యాక్టివ్ యూజర్లతో భారత్ అతిపెద్ద టెలికాం మార్కెట్‌‌గా ఉంది. 

ఫారెక్స్ నిల్వలు
బంగారం, భూమి  ఇలా.. మనుషుల ఆస్తి ఎలాగైతే వివిధ రూపాల్లో ఉంటుందో దేశానికి కూడా అంతే.  దేశం ఆర్థికంగా బలహీనపడకుండా భారత్ దగ్గర విదేశీ మారక ద్రవ్య నిధులు ఉంటాయి. ఇవి బంగారం, గవర్నమెంట్ బాండ్స్, ఇనిస్టిట్యూషనల్ బాండ్స్, ఫారిన్ కరెన్సీ రూపంలో ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నప్పుడు దేశ అవసరాలను తీర్చడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.  స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఇవి 1,029 కోట్లు ఉంటే ఇప్పుడు 46 లక్షల కోట్లు ఉన్నాయి.   ఫారెక్స్ నిల్వలు అత్యధికంగా ఉన్నదేశాల్లో ఇండియా ఐదవ స్థానంలో ఉంది.

గాంధీ ఆర్థిక విధానం
స్వతంత్ర సంగ్రామంలో గాంధీజీ అహింసా యోధుడిగానే కనిపిస్తారు. అయితే.. ఆర్థిక రంగంలోనూ మహాత్ముడు తనదైన ప్రణాళికలు వేశారు. అవసరం లేనప్పటికీ కొనుగోలు చేసే వినియోగ ఆర్థిక విధానాలకు గాంధీజీ వ్యతిరేకం. అందుకే ఆయన విలాసవంతమైన జీవితాన్ని ఎప్పుడూ సమర్థించలేదు. సరళమైన జీవనమే సరైన జీవితమని గాంధీజీ భావించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు.. వ్యవసాయం, కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని గాంధీజీ అనేవారు. ఆ రోజుల్లో  వ్యవసాయంపై ప్రజలు ఎక్కువగా ఆధారపడ్డారు. రైతులు, కూలీలు, శ్రామిక వర్గ ప్రయోజనాలను గాంధీజీ అర్థం చేసుకున్నారు. అధిక జనాభా గల దేశంలో.. ఎక్కువమంది ఆధారపడిన రంగాలకు సరైన ప్రాముఖ్యత ఇస్తూ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడం మహాత్ముడి విధానం.ఆ తర్వాత కాలంలో ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. అవన్నీ దేశాన్ని సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్‌‌‌‌ వైపు నడిపించాయి.  ఇలా తొలిసారి పారిశ్రామికీకరణతో, రెండోసారి సంస్కరణలతో గాంధీజీ ఆర్థిక విధానాలను దేశం పాటించలేకపోయింది. ఈ ప్రక్రియలో, వ్యవసాయ రంగాని కంటే ఐటీ లాంటి సేవల పరిశ్రమకు ప్రాధాన్యం లభించింది. అయితే మారుతున్న పరిస్థితులు ఇప్పుడు మళ్లీ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత పెంచుతున్నాయి. గాంధీ కలలు కన్న వ్యవసాయ, గ్రామ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపే ఇప్పుడు అడుగులు పడుతున్నాయి.


ఎన్నో సవాళ్లు..
ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో  ద్రవ్యోల్బణం ఇబ్బంది పెడుతోంది. కరోనా, ఉక్రెయిన్ వార్ కారణంగా వస్తువుల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీంతో ఆర్థిక మాంద్యం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ పెరగడానికి బదులుగా కుంచించుకుపోతుంటే దాన్ని ‘ఆర్థిక మాంద్యం’ అంటారు. ఆర్థిక మాంద్యం చుట్టుముడితే  ద్రవ్యోల్బణం, నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతాయి. ప్రజల ఆదాయం తగ్గిపోతుంది. స్టాక్ మార్కెట్‌‌పై కూడా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మనదేశంలో వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని అందరూ భావిస్తున్నారు. కరోనా సంక్షోభం పెరగడం, ఉక్రెయిన్ - రష్యా వార్‌‌, చమురు ధరలు, ఆయిల్ కొరత లాంటి ఆందోళనకు తోడు తాజాగా తైవాన్‌‌ ముప్పు భయాల నేపథ్యంలో రూపాయి విలువ రికార్డు స్థాయిలో తగ్గింది. డాలరు విలువ రూ.79.61 గా ఉంది. ప్రస్తుతం  ప్రపంచ దేశాల ఆర్థిక, సాంకేతిక రంగాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తున్నాయి. అందుకే ఏ దేశంలో ఆర్థిక సంక్షోభం సంభవించినా దాని ప్రభావం ప్రపంచమంతటికీ వేగంగా విస్తరిస్తోంది.

నాలుగు సార్లు ఆర్థిక మాంద్యం
ఆర్బీఐ చెప్తున్నదాని ప్రకారం భారతదేశంలో నాలుగు సార్లు ఆర్థిక మాంద్యం వచ్చింది.1957-58లో వృద్ధి రేటు ‘-1.2%’గా నమోదై తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఎగుమతులు కంటే దిగుమతులు ఎక్కువ కావడం ఆర్థిక మాంద్యానికి కారణమైంది.  ఇక 1965-66లో దేశంలో తీవ్రమైన కరువు సంభవించింది. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో ఆశించినంతగా పంటలు పండలేదు. ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడింది. ఆ ఏడాది ఏకంగా ‘-3.66%’ శాతం వృద్ధి రేటు నమోదైంది.ఆ తర్వాత 1972-73లో అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్‌‌‌‌లో ఆర్థిక మాంద్యానికి కారణమైంది. ప్రపంచ మార్కెట్​లో చమురు ధరలు ఏకంగా 400 శాతానికి పెరిగాయి. దీంతో 1972-73లోనూ భారత్‌‌‌‌లో ‘- 0.3%’ శాతం ప్రతికూల వృద్ధిరేటు నమోదైంది. ఇక నాలుగోసారి 1980లో ఇరాన్‌‌‌‌లో విప్లవం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలకు చమురు దిగుమతులు నిలిచిపోయాయి. చమురు దిగుమతుల బిల్లు రెట్టింపు అయ్యింది. దీంతో 1980లో కూడా ‘-5.2%’ వృద్ధి రేటు నమోదైంది.