మహీ.. మ్యాచ్ విన్నర్: వరల్డ్ కప్ లో కీలకం

మహీ.. మ్యాచ్ విన్నర్: వరల్డ్ కప్ లో కీలకం
  • ప్రపంచకప్‌ లో ధోనీనే అత్యంత కీలకం
  • ఒక్కరు మినహా వరల్డ్‌ కప్‌ టీమ్‌ రెడీ
  • రేసులో పంత్‌, శంకర్‌, రహానె: చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాను వచ్చే వరల్డ్‌ కప్‌ లో అందరూ ఫేవరెట్‌ టీమ్‌ గా పరిగణిస్తున్నారు. మరో నాలుగు నెలల్లో ఇంగ్లండ్‌ లో మొదలయ్యే ప్రపంచకప్‌ కొల్లగొట్టేందుకు 15 మంది పవర్‌ ఫుల్‌‌‌‌ ప్లేయర్లను ఎంపికచేసే పనిలో బిజీగా ఉన్న చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఒక్క స్థానం మినహా జట్టుపై ఇప్పటికే అవగాహనకు వచ్చామంటున్నాడు. వెటరన్‌ ప్లేయర్‌ ధోనీ ఈ మెగా టోర్నీలో జట్టుకు అత్యంత కీలకం కానున్నాడని చెబుతున్నాడు. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వరల్డ్‌ కప్‌ లో ఆడడం పక్కా అని పరోక్షంగా చెబుతున్న ప్రసాద్‌.. ఆల్‌‌‌‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ తో పాటు టెస్ట్‌‌‌‌ టీమ్‌ వైస్‌‌‌‌ కెప్టెన్‌ అజింక్యా రహానె కూడా వరల్డ్‌ కప్‌ రేసులో ఉన్నారని ‘క్రిక్‌ ఇన్ఫో’ వెబ్‌ సైట్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. టీమిండియా ఆటతీరు, వరల్డ్‌ కప్‌ టీమ్‌ గురించి ఎమ్మెస్కే చెప్పిన వివరాలు అతని మాటల్లోనే..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తో వన్డే సిరీస్‌ ల్లో టీమిండియా తిరుగులేని విజయాలు సాధించింది. ఈ టూర్ల తర్వాత వరల్డ్‌‌‌‌కప్‌ లో పాల్గొనే ఇండియా జట్టులో ఒకటి మినహా 15 స్థానాలు దాదాపు ఖాయమైనట్టే అనిపిస్తోంది. అయితే, ఈ రెండు సిరీస్‌ ల్లో కొందరు ఆటగాళ్ల పర్ఫామన్స్‌ కొత్త డైమెన్షన్‌‌‌‌ను చూపించింది. అందుకే ఆ ఒక్క స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం వస్తోంది. ముఖ్యంగా విజయ్‌ శంకర్‌ ఆకట్టుకున్నాడు. గత రెండేళ్ల నుంచి ఇండియా-ఎ టూర్లలో ఆడిస్తూ అతడి ప్రతిభను మెరుగుదిద్దుతున్నాం. ఆల్‌‌‌‌రౌండర్‌ కోటాలో పాండ్యా, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజాతో పాటు విజయ్‌ శంకర్‌
కూడా ముందున్నాడు. వీరు బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండింటిలోనూ జట్టుకు బలాన్నిస్తారు. అయితే, మేం నలుగురినీ తీసుకోలేం కదా! టీమ్‌ బ్యాలెన్స్‌ దెబ్బతినకుండా, ఎలాంటి కాంబినేషన్లతో బరిలోకి దిగాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీమ్‌ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాతో హోమ్‌ సిరీస్‌ తర్వాత మిగిలిన ఆ ఒక్క ఆటగాడిని కూడా గుర్తిస్తాం.
‘కుల్‌చా’ జోడీతో పదునెక్కిన బౌలింగ్‌
వాస్తవానికి 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ముగిసిన వెంటనే ఈ వరల్డ్‌‌‌‌కప్‌ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. నాడు చాంపియన్స్‌ ట్రోఫీలో మన జట్టు అద్భుతంగా ఆడి ఫైనల్‌‌‌‌కు చేరుకుంది. అప్పుడు అశ్విన్‌‌‌‌, జడేజా బాగానే ఆడినా.. స్పిన్‌‌‌‌ విభాగం మరింత వైవిధ్యంగా ఉండాలని సెలెక్షన్‌‌‌‌ ప్యానెల్‌‌‌‌ భావించింది. ఆ కారణం వల్లే చహల్‌‌‌‌, కుల్దీప్‌ రేసులోకి వచ్చారు. వాళ్లు వచ్చాక ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. ఈ ఇద్దరు కలిసి 70 శాతం మ్యాచ్‌ లు గెలిపించారు. ఈ జోడీ మన బౌలింగ్‌ విభాగాన్ని పదునెక్కించడమే
కాదు మరింత బలంగా మార్చింది.
కఠిన నిర్ణయాలు తప్పవు
టెస్ట్‌‌‌‌ టీమ్‌ వైస్‌ కెప్టెన్‌‌‌‌ అజింక్యా రహానె కూడా వరల్డ్‌‌‌‌కప్‌ రేసులో ఉన్నాడు. విదేశాల్లో రహానెకు మంచి రికార్డు ఉంది. టెస్ట్‌‌‌‌ల్లో కొన్ని ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ లు ఆడినా..
కొంతకాలంగా అతను సెంచరీ చేయని మాట వాస్తవమే. ఇంగ్లం డ్‌ తో టెస్ట్‌‌‌‌ సిరీస్‌ లో అతని ఆటతీరు కాస్త ఆందోళన పరిచినా.. ఆస్ట్రేలియాలో విజయానికి అవసరమైన పరుగులు చేయడం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దేశవాళీ క్రికెట్‌ లో కూడా రహానె మంచి ఫామ్‌ కనబరిచాడు. అందువల్ల వరల్డ్‌‌‌‌కప్‌ టీమ్‌ సెలెక్షన్‌‌‌‌ నుంచి అతడు తప్పుకోలేదు. అయితే, తుది జట్టు సెలెక్షన్‌‌‌‌ అప్పుడు ఆటగాడు చేసిన రన్స్‌ కంటే కూడా ఫామ్‌ ను, అతని మైండ్‌ సెట్‌ ను దృష్టిలో ఉంచుకొని మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో రహస్య ఎజెండా ఏమీ లేదు. సరైన కాంబినేషన్‌‌‌‌తో
ముందుకెళ్లేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు.
రిషభ్‌ సూపర్‌
గత ఏడాదికాలంగా అన్ని ఫార్మాట్లలోనూ రిషభ్‌ పంత్‌ ఎదుగుదల గొప్పగా ఉంది. ప్రస్తుతం అతనికి కొంత పరిపక్వత, అనుభవం కావాలని అనుకున్నాం. అందువల్లే అవకాశం వచ్చి న ప్రతీసారి ఇండియా–ఎ టీమ్‌ లో ఆడించాం. సిడ్నీ టెస్ట్‌‌‌‌లో అతను చేసిన సెంచరీ, ఇటీవల ఇండియా–ఎ తరఫున క్లిష్టమైన పిచ్‌ పై ఇంగ్లండ్‌ లయన్స్‌ తో ఆడిన మ్యాచ్‌ లో 73 పరుగుల ఇన్నింగ్స్‌ ను చూస్తే అతని మెచురిటీ లెవెల్స్‌  పెరిగాయని అర్థం అవుతోంది. ముఖ్యం గా లయన్స్‌ తో పోరులో కష్టాల్లో చిక్కుకున్న మన జట్టు ఓడిపోతుందని అంతా భావించా రు. కానీ, పంత్‌ ఎంతో నైపుణ్యంతో, ఓపికతో ఆడి జట్టును గెలిపించాడు. అందువల్ల అతను కచ్చితంగా సెలెక్షన్‌‌‌‌ రేసులో ఉంటాడు.

ధోనీ మునుపటిలా..
ఆసీస్‌ , కివీస్‌ తో వన్డే సిరీస్‌ ల్లో మహీ ఆటతీరును పరిశీలిస్తే.. ఇప్పుడతను తన సహజ
శైలిలో ఆడాలని డిసైడైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. మహీలో మునుపటి జోరు కనిపిస్తోంది. ముఖ్యం గా వరల్డ్‌‌‌‌కప్‌ నకు ముందు ఐపీఎల్‌‌‌‌లో మరో 14–16 హై ఇంటెన్సిటీ మ్యాచ్‌ ల్లో బరిలోకి దిగుతాడు. ఈ రెండు టూర్లలో ఫామ్‌ ను కొనసాగించేం దుకు అతనికి అవకాశం లభిస్తుంది. ధోనీ ఇప్పటికీ మ్యాచ్‌ విన్నరే. అందులో అనుమానమే లేదు. వరల్డ్‌‌‌‌కప్‌ లో రెండో వికెట్‌ కీపర్‌ ను ఎంచుకోవడం కోసమే వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ల్లో మహీకి విశ్రాంతి ఇచ్చి దినేశ్‌ కార్తీక్‌ , రిషభ్‌ పంత్‌ లను పరీక్షించాం. అంతేకాని.. ధోనీపై వేటు వేయలేదు. వరల్డ్‌‌‌‌కప్‌ లో ఇండియాకు అత్యంత
కీలకమైన వ్యక్తి మహీనే. వికెట్‌ కీపర్‌ గా, విరాట్‌ కు సలహాలు ఇచ్చే పాత్రలో, మైదానంలో యువ ప్లేయర్లకు మార్గనిర్దేశం చేయడంలో మహీ కీలకం కానున్నాడు.