ఎరువులు రెడీ.. 1.34 కోట్ల ఎకరాల్లో సాగు అంచనా

ఎరువులు రెడీ..  1.34 కోట్ల ఎకరాల్లో సాగు అంచనా

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్​కు సంబంధించి ఎరువుల కొరత లేకుండా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది.  సీజన్​కు అనుగుణంగా ఎరువులను అందుబాటులోకి తీసుకువస్తోంది. వచ్చే సీజన్‌‌లో 1.34  కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేసిన నేపథ్యంలో ఎరువులు,  యూరియా అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఫర్టిలైజర్స్​పై ప్రత్యేక దృష్టి సారించింది. 

నిరుడు వానాకాలం సీజన్‌‌లో 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నిరుడు 65 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, ఈసారి 66  లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది  పత్తి 44.77 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఈసారి అదనంగా మరో 15.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా రైతులను ప్రోత్సహించనున్నారు. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది పత్తికి మరింత డిమాండ్​  ఏర్పడడం, అంతర్జాతీయ మార్కెట్ లో కాటన్​  బెయిళ్ల కొరత ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో పత్తి సాగును మరింత పెంచాలని భావిస్తున్నారు.

ఇప్పటికే 4.50 లక్షల టన్నుల యూరియా సిద్ధం

వానాకాలం సీజన్‌‌కు 24.40 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అగ్రికల్చర్​ అధికారులు ప్లాన్​ చేశారు. ఇందులో ప్రత్యేకంగా యూరియా 10.40 లక్షల టన్నుల అవసరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వానాకాలం సీజన్‌‌–2024కు ఎరువుల ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం  ఆమోదించిందని, ఆ ప్రకారం కేటాయింపులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో గతేడాదికి సంబంధించిన ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. అవసరానికి మించి ఎరువులు బఫర్‌‌స్టాక్‌‌  ఉన్నట్లు మార్క్‌‌ఫెడ్‌‌  వర్గాలు వెల్లడించాయి. 

రాష్ట్రంలో యూరియాతోపాటు డీఏపీ 2.40 లక్షల  టన్నులు, ఎన్‌‌పీకే 10 లక్షల టన్నులు, ఎంఓపీ 60 వేల టన్నులు, ఎస్‌‌ఎస్‌‌పీ లక్ష టన్నులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. నెలల వారీగా ఎప్పుడు, ఎంత  అవసరమన్న దానిపై ఫర్టిలైజర్​ ప్లాన్​లో పేర్కొన్నారు. సీజన్  ప్రారంభం అయ్యే ఏప్రిల్‌‌  నుంచి సీజన్​ పూర్తయ్యే సెప్టెంబర్‌‌  వరకు ఏ ఎరువులు ఎంత అవసరమో ప్రణాళిక రూపొందించారు. ఎరువులు ఎక్కువగా మే, జూన్‌‌  నెలల్లో 4.60 లక్షల టన్నుల చొప్పున కేటాయించారు. ఈ రెండు నెలలకే 9.20 లక్షల టన్నులు ఎరువులు కేటాయించారు.  రానున్న వానాకాలం సీజన్​లో ఏమాత్రం ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అగ్రికల్చర్, మార్క్​ఫెడ్​ వర్గాలు  పేర్కొన్నాయి. 

సీజన్​కు విత్తనాలు కూడా రెడీ

సాగుకు అనుగుణంగా సీడ్​ ప్లాన్​ను ఇప్పటికే వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ వానాకాలం సీజన్‌‌కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేసింది. అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులోకి తెస్తోంది. అలాగే కాటన్​ సీడ్స్​ 54 వేల క్వింటాళ్లు, సోయాబీన్‌‌ విత్తనాలు 1.49 లక్షల క్వింటాళ్లను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుసెనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు. అలాగే జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా సిద్ధం చేస్తున్నారు.