- న్యాయం కోసం ఆర్డీవో ఆఫీస్ చుట్టూ వృద్ధురాలి ప్రదక్షిణలు
మంథని, వెలుగు: ఆస్తులు రాయించుకొని కన్నతల్లిని ఇంటికి గెంటేయగా, న్యాయం కోసం వృద్ధురాలు ఆర్డీవో ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామానికి చెందిన మేడి లక్ష్మి(74) ఐదేళ్లుగా గోదావరిఖనిలో ఒంటరిగా జీవిస్తోంది. సింగరేణి ఉద్యోగి అయిన ఆమె భర్త మేడి లింగయ్య అనారోగ్యంతో 2020 మార్చి 26న చనిపోయాడు. తండ్రి ఉద్యోగాన్ని పెద్ద కొడుకు మేడి రమేశ్‌కు ఇప్పించారు. రెండో కొడుకు మేడి కృష్ణమోహన్ ఎల్ఐసీ ఉద్యోగిగా పని చేస్తూ గోదావరిఖనిలో స్థిరపడ్డాడు.
తన భర్త పేరు మీద ఉన్న ఆస్తులను ఇద్దరు కొడుకులు అక్రమంగా తమ పేరిట రాయించుకున్నారని బాధితురాలు తెలిపింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాల గ్రామంలో ఉన్న 6 ఎకరాల భూమిని అమ్ముకున్నారు. ఆస్తి చేతికి రాగానే తనను చిత్రహింసలకు గురి చేసి ఇంటి నుంచి గెంటేశారని వాపోయింది. భర్త పెన్షన్ డబ్బులతో పెద్ద కోడలు చిట్టీలు వేసుకొని డబ్బులు దగ్గర పెట్టుకుందని, తనకు కొత్త పెన్షన్ రాకుండా పేపర్లను కొడుకులు గుంజుకొని ఇవ్వడం లేదని తెలిపింది.
ఈక్రమంలో గత ఆగస్ట్‌లో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఆమె ఫిర్యాదు చేయగా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై సెప్టెంబర్ 29న, అక్టోబర్ 18న విచారణ జరిగింది. బెస్తపల్లిలో మిగిలి ఉన్న 35 గుంటల భూమి విషయాన్ని మంథని ఆర్డీవోకు బదిలీ చేశారు. తనకు కొడుకులు, కోడళ్ల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు త్వరగా స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు
వేడుకుంటోంది.
