తాడ్వాయి/యాదగిరిగుట్ట/వేములవాడ, వెలుగు: ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మేడారం వన దేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించి, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో మేడారంలో జాతర వాతావరణం కనిపించింది. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 వేల మందికి భక్తులు మేడారం తరలివచ్చినట్లు ఈవో మేకల వీరేశం తెలిపారు.
యాదగిరిగుట్టలో..
లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అర గంట సమయం పట్టింది. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.45,47,247 ఆదాయం వచ్చింది.
వేములవాడలో..
వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తులు స్వామిని దర్శించుకొని కోడెమొక్కులు చెల్లించుకున్నారు.
