- బీసీ గురుకులాల్లో 9 వేల సీట్లకు 4,300 అడ్మిషన్లు
- ఎస్సీలో 60 శాతం.. ఎస్టీలో 57 శాతం సీట్లు ఫిల్
- త్వరలో స్పాట్ అడ్మిషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ సగం వరకే పూర్తైంది. మంచి ఎడ్యుకేషన్‌తో పాటు ఫ్రీ హాస్టల్, ఇతర సదుపాయాలు ఇస్తున్నా.. డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు స్టూడెంట్స్ ఆసక్తి చూపడం లేదు. దీంతో చాలా కాలేజీల్లో సీట్లు ఖాళీగానే ఉన్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి అడ్మిషన్లు కొంత పెరిగాయి.
బీసీ గురుకులాల్లో 4,300 సీట్లు ఫిల్..
బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 33 డిగ్రీ కాలేజీలు ఉండగా.. మొత్తం 9 వేల సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 4,300 సీట్లు భర్తీ అయ్యాయి. బాయ్స్ కంటే గర్ల్స్ అడ్మిషన్లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇంజినీరింగ్ సీట్ల భర్తీలో మూడో ఫేస్ పూర్తి కావటంతో అక్కడ సీటు దక్కని వాళ్లు డిగ్రీలో జాయిన్ అవుతారని అధికారులు భావిస్తున్నారు.
ఎస్టీ, ఎస్సీ గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి..
ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో 22 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మూడు సంవత్సరాల కోర్సులు కలిపి మొత్తం 16,480 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్‌లో ఉన్న 5,680 సీట్లకు గాను ఇప్పటివరకు 3,246 సీట్లు ఫిల్ అయ్యాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 28 డిగ్రీ కాలేజీలు ఉండగా.. ఇప్పటివరకు 60 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎస్టీ గురుకులాల్లో 57 శాతం సీట్లు ఫిల్ అయినట్లు అధికారులు తెలిపారు.
డిగ్రీపై తగ్గుతున్న ఇంట్రెస్ట్..
ఇంటర్ తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల వైపు వెళ్తున్నారు. దీంతో డిగ్రీ కోర్సులపై ఇంట్రెస్ట్ తగ్గుతోందని ఎడ్యుకేషన్ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో దాదాపు 4 లక్షల సీట్లు ఉండగా.. ఏటా సుమారు 2.5 లక్షల సీట్లు మాత్రమే ఫిల్ అవుతున్నాయి. డిగ్రీ అడ్మిషన్లను ఉన్నత విద్యా మండలి దోస్త్ ద్వారా చేపడుతోంది. మూడు ఫేజ్‌లు పూర్తి కాగా.. త్వరలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
