- హత్యకు రూ.3 లక్షల సుపారీ
- కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లో ఘటన
రామడుగు/కరీంనగర్ క్రైం, వెలుగు: కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ వ్యక్తి సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించాడు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్ తన కార్యాలయంలో ఆదివారం మీడియాకు హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య(36)కు, శిరీషతో 15 ఏళ్ల కింద వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. అంజయ్య ఉపాధి కోసం 2017లో విదేశాలకు వెళ్లి 2019లో తిరిగి వచ్చాడు. తన తండ్రి గాదె లచ్చయ్య, శిరీష మధ్య సాన్నిహిత్యాన్ని చూసి పలుమార్లు తండ్రి, భార్యను మందలించాడు.
ఈ విషయమై పలుమార్లు తండ్రిని కొట్టాడు. దీంతో కొడుకును హత్య చేయాలని నిర్ణయించుకున్న లచ్చయ్య అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి సాయంతో అతని బంధువు ఉప్పరపల్లి కోటేశ్వర్, అతడి స్నేహితుడు మహమ్మద్ అబ్రార్‌తో కలిసి అంజయ్యను చంపేందుకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొదటగా రూ.1.25 లక్షలు చెల్లించాడు. అంజయ్యను పథకం ప్రకారం చంపేందుకు కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్ స్నేహం చేశారు. మద్యం తాగుదామని ఈ నెల 2న గ్రావిటీ కెనాల్ వద్దకు రప్పించి అతిగా మద్యం తాగించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లాక కోటేశ్వర్, అబ్రార్ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా డెడ్‌బాడీని గాయత్రి పంపుహౌస్ కెనాల్లో పడేశారు.
ఈ నెల 5న గ్రావిటీ కెనాల్లో అంజయ్య డెడ్‌బాడీ లభ్యమైంది. లచ్చయ్య, శిరీష ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు లోతుగా విచారించారు. విచారణలో గాదె లచ్చయ్య సుపారీ ఇచ్చి తన కొడుకును హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసులో నిందితులు గాదె లచ్చయ్య, గాదె శిరీష, ఉప్పరపల్లి కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్, కొలిపాక రవిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.40 వేలు, బైక్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు మిస్టరీ ఛేదించిన చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్సై కె.రాజును ఏసీపీ అభినందించారు.
