భద్రాచలం, వెలుగు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఆదివారం గన్ మిస్ ఫైర్ అయి డీఆర్జీ జవాన్ చనిపోయాడు. జిల్లాలోని కడేనార్ క్యాంప్‌లో పని చేస్తున్న డీఆర్జీ జవాన్ బల్దేవ్ సింగ్ హుర్రా శనివారం మావోయిస్టుల ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్‌కు వెళ్లారు.
తిరిగి క్యాంప్‌నకు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయి తలలోకి తూటా దూసుకెళ్లింది. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. పోస్టుమార్టం అనంతరం డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు.
