రేషన్ కార్డులు ఇవ్వనోల్లు.. ఓట్లు ఎలా అడుగుతారు? : మంత్రి పొంగులేటి

రేషన్ కార్డులు ఇవ్వనోల్లు.. ఓట్లు ఎలా అడుగుతారు? : మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్​ నేతలను ప్రశ్నించారు. పేదలకు రేషన్​కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా నాటి దొర కేసీఆర్ కు లేకపాయే అని విమర్శించారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీలోని 1,21,19,18,31,32,17,14,16వ వార్డుల్లో మంత్రి రోడ్ షో నిర్వహించారు. రెడ్డిపల్లి (1వ వార్డు) నుంచి ప్రారంభమైన రోడ్ షో ముత్తగూడెం, గొల్లగూడెం, బారుగూడెం మీదుగా ఏదులాపురం, మద్దులపల్లి, తెల్దారుపల్లి వరకు కొనసాగింది.

ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడుతూ ఎన్నికలు రాగానే రంగురంగుల కండువాలు వేసుకుని మాయమాటలు చెప్పేందుకు కొందరు వస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గతంలో వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టిన వారు.. నేడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతు ధరతోపాటు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటుందని గుర్తుచేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీలో మొదటి విడత కింద ఇప్పటికే 587 ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రెండో విడత జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి సమక్షంలో చేరికలు..

ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కీలక నేత తప్పెట్ల గిడ్జన్ (మున్నా) ఆధ్వర్యంలో బీఆర్ఎస్, సీపీఐ ముఖ్యనేతలు, సుమారు 40 కుటుంబాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం 
నెలకొంది.