విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్,వెలుగు : ఖమ్మం నగరపాలక సంస్థ సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రత్యేక డ్రైవ్ తో మంచి ఫలితాలు వచ్చాయని, మరోసారి పారిశుధ్య నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. చెత్త రవాణా వాహనాలకు జీపీఎస్, ఫ్యూయల్ సెన్సార్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. పారిశుధ్య కార్మికుల హాజరు నమోదులో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా ఉన్న హోర్డింగ్స్, పోస్టర్లను తొలగించాలని,పబ్లిక్ ప్రదేశాల్లో పోస్టర్లు అతికిస్తే భారీ జరిమానాలు విధించడంతోపాటు కేసులు నమోదు చేయాలని తెలిపారు.

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, పనుల పురోగతిపై ప్రతివారం నివేదిక అందించాలని తెలిపారు. నగరంలో డిఫాల్టర్లను గుర్తించి వారికి వాటర్ సప్లై కట్ చేయాలని, ఇండ్లు, భవనాలను సీజ్ చేయాలని చెప్పారు. వాణిజ్య సముదాయాల ఆస్తి పన్ను వసూలు 33 శాతం మాత్రమే ఉందని, పన్ను కట్టని వ్యాపారస్తుల ట్రేడ్ లైసెన్స్ వెంటనే రద్దుచేయాలన్నారు.  అమృత్ 2.0 పథకం క్రింద చేపట్టిన తాగునీటి సరఫరా పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.

నగరంలో పెండింగ్ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను 4 వారాల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలను పని తీరుపై ఆరా తీశారు. అంతకుముందు నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.8.50 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.

స్టేడియంలో రూ.50 లక్షలతో నిర్మించిన టేబుల్ టెన్నిస్ హాల్ ను సందర్శించారు. సింథటిక్ రన్నింగ్ ట్రాక్ పై తిరుగుతూ పనుల నాణ్యతను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.