- పిరికితనంతో పనికిరాని ప్రయత్నాలు చేస్తున్నరు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
చేవెళ్ల, వెలుగు: గాంధీజీ పేరు పలకడం ఇష్టం లేకనే ఉపాధి హామీ పథకం పేరును కుట్ర పూరితంగా ప్రధాని మోదీ మార్చారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. జాతీయ ఉపాధిహామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ‘‘వీజీబీ రామ్ జీ వద్దు- గాంధీజీ ముద్దు” అంటూ నినాదాలు చేశారు. ఇందులో మహేశ్‌గౌడ్ మాట్లాడారు. ‘‘మోదీ పిరికితనంతో పనికిరాని ప్రయత్నాలు చేస్తున్నరు.
ఎన్ని కుట్రలు చేసినా జాతిపిత స్థానం ఎన్నటికీ మారదు” అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తే.. బీజేపీ దాన్ని తొక్కిపెట్టిందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం కుట్రపూరితమైన చర్య అని ఏఐసీసీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డి మండిపడ్డారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
