కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్రలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

కాంగ్రెస్ ప్రతిష్టను  దెబ్బతీసేందుకు కేంద్రం కుట్రలు : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్​కర్నూల్, వెలుగు: దేశం కోసం త్యాగాలకు పాల్పడిన గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్రలు పన్నుతూ, కాంగ్రెస్​ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నేషనల్​ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్  అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్​గాంధీపై కేంద్రం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఆదివారం నాగర్​కర్నూల్​లో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్​ చౌరస్తాలో నిరసన తెలిపారు. 

డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి, బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు కాయితి విజయ్​కుమార్​ రెడ్డి, ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్​ హెరాల్డ్​ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్​ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్​ ప్రభంజనంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమని, రాహుల్​ గాంధీ దేశ ప్రధాని అవుతారని తెలిపారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా క్లీన్​చిట్​తో బయటకు వస్తారని తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ క్వార్టర్​ను రద్దు చేస్తే, తల్లి క్వార్టర్​లో ఉండాల్సి వచ్చిందని గుర్తు చేశారు.