నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు

నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు
  • తనకు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన వ్యక్తి 

బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : ‘పెళ్లి అయినప్పటి నుంచి నా భార్య మానసికంగా, శారీరకంగా వేధిస్తోంది,  ఆమె నుంచి నాకు, నా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి’ అని అల్వాల్‌‌‌‌కు చెందిన టెమూజియన్‌‌‌‌ అనే వ్యక్తి పోలీసులను కోరారు. హైదరాబాద్‌‌‌‌ హైదర్‌‌‌‌గూడలోని ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో వివరాలు వెల్లడించారు. ఏపీలోని అమలాపురానికి చెందిన టెమూజియన్‌‌‌‌కు, రాజోలుకు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. టెమూజియన్‌‌‌‌ మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌గా పనిచేస్తూ భార్యతో కలిసి అల్వాల్‌‌‌‌లో ఉంటున్నాడు.

పెళ్లి అయినప్పటి నుంచి భార్య వేధిస్తుండడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా తీరు మారలేదు. ఇటీవల కత్తితో తనపై దాడి చేసిందని, ఇదే విషయంపై అల్వాల్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు స్పందించి తన భార్యపై కేసు నమోదు చేసి, తనకు రక్షణ కల్పించాలని కోరారు.