రాను రానూ కల్తీ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పాలు మొదలుకొని నుంచి అల్లం పేస్ట్, టూత్ పేస్ట్ వరకు దేన్నీ వదలకుండా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవల వెలుగులోకి వచ్చిన బేగం బజార్ బ్రాండెడ్ వస్తువుల కల్తీ ఘటన మరువక ముందే గచ్చిబౌలిలో మరో కల్తీ బాగోతం బయటపడింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో కల్తీ వంట నూనె, గోధుమపిండిని సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు.
గచ్చిబౌలి పరిధిలోని వట్టినగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాత్ ట్రేడర్స్ అనే దుకాణంపై దాడి చేసి, భారీ మొత్తంలో కల్తీ వంట నూనె, గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.దాడిలో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి, వాటిని సోయాబీన్ నూనెతో కలిపి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజా ఆయిల్ వంటి పేర్లతో మళ్లీ ప్యాకింగ్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అదే విధంగా పలు కంపెనీలకు చెందిన గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాత్ గోల్డ్ చక్కి అట్టా పేరుతో తిరిగి ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.
ఈ దాడుల్లో 5 వేల లీటర్ల కల్తీ వంట నూనె,5 టన్నుల కల్తీ గోధుమ పిండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ అక్రమ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
►ALSO READ | హైదరాబాద్ LB నగర్లో.. లక్ష లంచం తీసుకుంటూ.. ACBకి దొరికిపోయిన ఇద్దరు ఎస్ఐలు
నిందితుడి దగ్గర నుంచి వెయింగ్ మెషిన్, ఒక ఆయిల్ ఫిల్టర్ మెషిన్, ఒక గోధుమ ఫిల్టర్ మెషిన్, ఖాళీ సంచులు, రెండు మొబైల్ ఫోన్లు మరియు TS07UL2884 నంబర్ టెంపో ట్రాలీ ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ రూ.21 లక్షల 91 వేల 980గా అంచనా వేశారు.
ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన భన్వర్ రామ్ జాట్ (46) మరియు అతని కుమారుడు అశోక్ కుమార్ (22) లను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
