చిట్టీల పేరుతో భారీ మోసం.. మీడియాతో 50 మంది బాధితుల ఆవేదన

చిట్టీల పేరుతో భారీ మోసం.. మీడియాతో 50 మంది బాధితుల ఆవేదన

పద్మారావునగర్, వెలుగు: చిట్ ఫండ్​డిపాజిట్ల పేరిట ఓ కుటుంబం చేసిన మోసానికి దాదాపు50 మంది బాధితులు దాదాపు రూ 15 కోట్లు నష్టపోయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్​ కు చెందిన ఓ బాధితుడు ఆకారం రమేశ్​ తో పాటు పలువురు బాధితులు ఆదివారం మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్​పల్లి హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన చేగొండి సూర్యనారాయణ ఫ్యామిలీ నమ్మించి చిట్టీల పేరుతో 2020లో 50 మంది నుంచి దాదాపు రూ.15 కోట్లు కట్టించుకుంది. 

గడువు ముగిసినా  తిరిగి డబ్బులు ఇవ్వకపోగా బాధితులు ఆందోళన చేయగా.. నిందితులు అప్రమత్తమై తమ ఫ్లాట్లు, ఇతర ఆస్తులు అమ్ముకుని పరార్ అయ్యారు. దీంతో బాధితులు 2020లో  కేపీహెచ్ బీ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి బెంగళూరులో నిందితులను అరెస్ట్​ చేశారు. బెయిల్ పై విడుదల అయ్యారని, కానీ తమ డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోసం చేసిన కేసులో ఏ1 గా సూర్యనారాయణ, కనకదుర్గా, హేమకిరణ్​, మాధురి ఉన్నారన్నారు. నాలుగేళ్లుగా కోర్టులు, పోలీస్​ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నామని, అధికారులు స్పందించడం లేదని వాపోయారు. తమ డబ్బులు రావడం లేదని,  పిల్లల పెండ్లిళ్లు, ఉన్నత చదువులకు  డిపాజిట్ చేశామని పేర్కొన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.