ఓవర్ లోడ్ వాహనాలపై తనిఖీలేవి?

ఓవర్ లోడ్ వాహనాలపై తనిఖీలేవి?
  • చేవెళ్ల ఘటన తర్వాత వారం పాటు రవాణా శాఖ హడావుడి
  • ఆ తర్వాత షరా మామూలే!
  • ఇటీవల ఖమ్మంలో ఓవర్ లోడ్‌‌తో వెళ్తున్న గ్రానైట్ లారీ బీభత్సం
  • రోడ్డుపై పడిన పెద్ద పెద్ద బండరాళ్లు.. తప్పిన ప్రమాదం
  •  ఓవర్ లోడ్ తనిఖీలపై రవాణా శాఖ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న జనం

హైదరాబాద్, వెలుగు: ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే విపరీతమైన హడావుడి చేసి.. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా చేతులు దులుపుకోవడంలో రవాణా శాఖకు మించిన శాఖ మరేది రాష్ట్రంలో ఉండదేమో అనే చర్చ ఇప్పుడు జనంలో సాగుతోంది. చేవెళ్ల వద్ద ఓవర్ లోడ్ తో కంకర తీసుకెళ్తున్న టిప్పర్.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటన తర్వాత రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలపై కన్నెర్ర జేశారు. ఓ వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలపై కేసులు బుక్ చేసి, పెద్ద మొత్తంలో జరిమానాలు విధించారు. పలు వాహనాలను సీజ్ చేశారు. 

ఆ తర్వాత షరా మామూలే. దీంతో మళ్లీ  తెలంగాణలో ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా సోమవారం ఖమ్మం టౌన్ లో ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఓ గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. ఆ లారీలో ఉన్న మూడు పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంతా ఊపరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటనతో మరోసారి ఓవర్ లోడ్ వాహనాలకు కళ్లెం ఎక్కడ? అనే చర్చ మొదలైంది. చేవెళ్ల ఘటన జరిగి నెల రోజులే అయినప్పటికీ.. ఓవర్ లోడ్ వాహనాలపై నిఘా, తనిఖీలు లేకపోవడం చూస్తే రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.

 చేవెళ్ల ఘటన తర్వాత వారం రోజుల పాటు తనిఖీలు నిర్వహించి వాటి ఫోటోలు, వీడియోలు మీడియాకు పంపి హడావుడి చేసిన రవాణా శాఖ.. ఆ తర్వాత వాటి జోలికిపోకపోవడమే తాజాగా ఖమ్మం సంఘటనకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలు మొదటిసారి పట్టుబడితే  ఆ వాహనాన్ని సీజ్ చేసి, యజమానికి భారీగా జరిమానా విధించాలి. రెండోసారి పట్టుబడితే డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయాలి. మూడోసారి పట్టుబడితే వాహన పర్మిట్ లను రద్దు చేయాల్సి ఉంటుంది. కానీ, వీటిని ఎక్కడా కూడా రవాణా శాఖ అధికారులు ఆచరించిన దాఖలాలు లేవు. 

తనిఖీలు చేయాలంటే వే బ్రిడ్జీలు ఉండాల్సిందే..

ఈ అంశంలో రవాణా శాఖ అధికారుల వాదన మరోలా ఉంది. రోడ్డుపై వెళ్తున్న టిప్పర్ లు, ఇతర భారీ ట్రక్కులను తాము ఆపని సందర్భంలో  ఓవర్ లోడ్ తో వెళ్తుందా? నిబంధనల మేరకే తగిన లోడ్ తో వెళ్తుందా? అని నిర్ధారించే సాధనాలు తమ వద్ద లేకపోవడంతో వీటిని కట్టడి చేయడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. 

వే బ్రిడ్జీలు ఎక్కడో చోట ఉండడం, తాము తనిఖీలు చేసిన ప్రాంతంలో అవి అందుబాటులో ఉండకపోవడంతో తాము అనుకున్న రీతిలో ఓవర్ లోడ్ వాహనాలపై తగిన చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. ఇక క్వారీ, గ్రానైట్ యజమానులు తెలివిగా పర్మిట్లలో పరిమితి లోడ్ అని చూపించి, వాహనాల్లో మాత్రం ఓవర్ లోడ్ నింపుతున్నారని, పైగా కొన్ని వాహనాలు పరిమితి లోడ్ తో ఉన్నా.. ఆ వాహనాల ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ ఆ లోడ్ ను కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉండదని చెప్తున్నారు. 

వీటిని పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలంటే వే బ్రిడ్జ్ లు అందుబాటులో ఉండాల్సిందేనని రవాణా శాఖ అధికారులు అంటున్నారు.  వాస్తవానికి 10 టైర్ల వాహనాలు 28 టన్నులను, 12 టైర్ల వాహనాలు 31 టన్నులను, 16  టైర్ల వాహనాలు  41 టన్నులను మాత్రమే తీసుకెళ్లాలనేది రవాణా శాఖ నిబంధనలు. అయితే, వీటిని నిర్ధారించేందుకు తమ వద్ద తగిన సాధనాలు లేకపోవడం, వే బ్రిడ్జీలు కూడా తగినంతగా లేకపోవడం, ఎక్కడో చోట ఉండడంతో తాము తనిఖీలు చేసినా.. వాస్తవ లోడ్ ను నిర్ధారించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది రవాణా శాఖ వాదన. 

రవాణా శాఖ ఉదాసీనత కారణంగానే..

ప్రధానంగా ఇసుక, మొరం, కంకర, సిమెంట్, బ్రిక్స్, గ్రానైట్ వంటి వాటితో భారీ వాహనాలు ఓవర్ లోడ్, అతి వేగంగా ప్రమాదకర స్థాయిలో వెళ్తుంటాయి. దీని వల్ల రోడ్డుపై వెళ్లే వారు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పోవాల్సిందే. పైగా ఓవర్ లోడ్ వెహికల్స్ తో ప్రధాన రోడ్లు తొందరగా దెబ్బతింటున్నాయి. ఇసుక, మొరం, కంకర, సిమెంట్ బ్యాగులు, బ్రిక్స్ ను తరలించే టిప్పర్ లు కనీస భద్రతా ప్రమాణాలు పాటించవు. చివరకు వాటిపై టార్ఫాలిన్ కూడా కప్పకపోవడంతో దుమ్ము ఒక్కసారిగా రోడ్డుపై వెళ్లే వారి కళ్లల్లోకి వెళ్లి ప్రమాదాలు జరుగుతున్నాయి. 

ఇలాంటివాటి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన రవాణా శాఖ చూసీ చూడనట్టు వ్యవహరించడంతోనే వాటిని కట్టడి చేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, క్వారీలు, గ్రానైట్ నిర్వాహకులు తమ పలుకుబడిని ఉపయోగించి రవాణా శాఖ అధికారులను నయానో, భయానో తమ దారికి తెచ్చుకుంటున్నారని.. అందుకే సంబంధిత శాఖ అధికారులు వీటి విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.