నేరడిగొండ, వెలుగు: విద్యతోనే ఆదివాసీల జీవితాల్లో మార్పులు వస్తాయని.. ఆదివాసీ యువత ఉన్నత విద్యపై దృష్టి పెట్టాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం సిరికొండ మండలంలోని కన్నాపూర్, కుంటగూడ, జెండాగూడ గ్రామాల్లో ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే చదువుతోనే సాధ్యమవుతుందన్నారు. గొప్ప లక్ష్యం ఏర్పాటుచేసుకొని దాన్ని సాధించే దిశగా కృషి చేయాలన్నారు.
గంజాయితో భవిష్యత్ నాశనమవుతుందని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యాధులు వస్తే నాటు వైద్యం చేసుకోకుండా ఆస్పత్రిలో చూపించుకోవాలన్నారు. అనంతరం సిరికొండ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ కాజల్ సింగ్, ఎస్సై పూజ పాల్గొన్నారు.
