నకిరేకల్, వెలుగు: అయ్యప్ప స్వామి ఎక్కడో ఉండరని, మాలధారణ చేసిన ప్రతి వ్యక్తిలోనూ ఉంటారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతుల ఆధ్వర్యంలో నకిరేకల్‌లోని వారి స్వగృహంలో అయ్యప్ప స్వామి నాలుగవ మహాపడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి నకిరేకల్‌లో అయ్యప్ప స్వాములకు భిక్ష, అల్పాహారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకాలు, పంచామృతాభిషేకం, పుష్పాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన స్వాముల శరణుఘోషతో పన్నాలగూడెం పరిసరాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, గురుస్వామి వెంకటేశ్వర శర్మతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
