ఇంద్రవెల్లి/బెల్లంపల్లి, వెలుగు: ఖానాపూర్ నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాల్లో నివాసముంటున్న ఆదివాసీలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు అటవీ శాఖ ఆటంకాలు సృష్టిస్తోందని, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్‌తో కలిసి హైదరాబాద్‌లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లాలో పార్టీ బలోపేతం, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సీఎంతో చర్చించారు. జనవరిలో జరిగే కేస్లాపూర్ నాగోబా జాతర ఏర్పాట్ల గురించి సీఎంకు వివరించారు.
జాతరకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు బొజ్జు పటేల్ తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు.
గడ్డం వినోద్‌ను అభినందించిన సీఎం
బెల్లంపల్లి నియోజకవర్గంలోని 114 సర్పంచ్‌స్థానాలకు గాను కాంగ్రెస్ తరపున పోటీ చేసిన 84 మంది గెలిచిన వివరాలున్న ప్రతిని ఎమ్మల్యే గడ్డం వినోద్ ముఖ్యమంత్రికి అందించారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేసి వినోద్‌ను అభినందించారు. పార్టీని మరింత బలోపేతం చేసి నడిపించాలని ఆయన సూచించారు.
