విద్య, వైద్యం ఉచితంగా అందించాలి : జస్టిస్‌‌ కె. లక్ష్మణ్ 

విద్య, వైద్యం ఉచితంగా అందించాలి : జస్టిస్‌‌ కె. లక్ష్మణ్ 

మునగాల, వెలుగు:  ప్రభుత్వాలు విద్య, వైద్యం ఉచితంగా అందించాలని, అప్పుడే దేశం ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర హైకోర్టు జడ్జి కె. లక్ష్మణ్ అన్నారు. మునగాల మండలం కొక్కిరేణిలోని వివేకానంద వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుందన్నారు.  ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్టుల్లో భూతగాదాలు, మద్యం, ప్రేమ వ్యవహారాల కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వయోవృద్ధుల సంరక్షణలో పిల్లలు బాధ్యతగా మెలగాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, బసవతారకం ఆసుపత్రి వైద్యులు, సేవా భారతి ప్రతినిధులు పాల్గొన్నారు.

మెడికల్ డిస్పెన్సరీ ప్రారంభం

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రం, మెడికల్ డిస్పెన్సరీని పోర్ట్‌‌ఫోలియో జడ్జి జస్టిస్ టి. మాధవి దేవి శనివారం వర్చువల్‌‌గా ప్రారంభించారు.  కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ పాల్గొన్నారు.

ఈ కేంద్రంలో ఒక డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్ అందుబాటులో ఉంటారని, అత్యవసర చికిత్సతో పాటు 105 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారని  తెలిపారు.  ప్రతి శనివారం ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదులు పాల్గొన్నారు.