- మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ జెండా ఎగరాలి
- పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాజీనామాకు డిమాండ్
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, ఎల్లారెడ్డి, వెలుగు : బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డిల్లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఆయా చోట్ల కార్నర్ మీటింగ్‌ల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ జైత్ర యాత్ర మున్సిపల్ ఎన్నికల నుంచే ప్రారంభం కావాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఆ పనులను తామే చేశామని కాంగ్రెస్‌వాళ్లు చెప్పుకుంటున్నారన్నారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో బాన్పువాడ నియోజకవర్గానికి రూ.10వేల కోట్లు ఇచ్చామన్నారు. అవసరమైతే తాము ఏమి చేశామో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామన్నారు.
బాన్సువాడకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిందేమి లేదని, ఫండ్స్ ఇచ్చింది కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ తరఫున పోచారంను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వ్యక్తి గత స్వార్థం కోసం కాంగ్రెస్ లో చేరారన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పెద్ద మనిషిగా గౌరవించి మంత్రి పదవి, స్పీకర్ పదవి కేసీఆర్ ఇచ్చారన్నారు. లక్ష్మీ పుత్రుడిగా చెప్పే వారన్నారు. ఎల్లారెడ్డి అభివృద్ధికి రూ.10కోట్ల ఫండ్స్ ఇవ్వాలని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంక్‌కు లేఖ రాయటం సిగ్గు చేటన్నారు.
తమ హయాంలో జరిగిన పనులను తానే చేశానని ఎమ్మెల్యే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. లెటర్లను ప్రొసీడింగ్ కాపీల పేరిట ఎమ్మెల్యే సంఘాల ప్రతినిధులను ఎమ్మెల్యే మోసగిస్తున్నారన్నారు. జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు తమ హయాంలో రూ.500 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల స్కీమ్ చేపట్టి పనులు మొదలు పెట్టామని, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను బెదిరించి పనులను ఆపివేయించారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంతుషిండే, జాజాల సురేందర్, నాయకులు గిర్ధావర్ గంగారెడ్డి, జుబేదార్, తానాజీరావు తదితరులు పాల్గొన్నారు.
పద్మాజీవాడి ఎక్స్ రోడ్డు వద్ద కారు ఆపి..
సదాశివనగర్ : బాన్సువాడకు కారులో వెళ్తున్న కేటీఆర్సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి ఎక్స్ రోడ్డు వద్ద ఆగి కార్యకర్తలకు అభివాదం చేసి కాసేపు మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మోజార్టీతో గెలుస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుటలో విఫలం అయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, శ్రీనివాస్ నాయక్, పడిగెల రాజేశ్వర్ రావు, కపిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
