వసతి గృహ సంక్షేమాధికారికి షోకాజ్ నోటీసులు : కలెక్టర్ కుమార్ దీపక్

వసతి గృహ సంక్షేమాధికారికి షోకాజ్ నోటీసులు : కలెక్టర్ కుమార్ దీపక్
  •     ఆహారం వికటించిన ఘటనలో కలెక్టర్ సీరియస్

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి సమీకృత బాలికల వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఆహారం వికటించి విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనను కలెక్టర్​ కుమార్ ​దీపక్ సీరియస్​గా పరిగణించారు. బాలికలు చికిత్స పొందుతున్న బెల్లంపల్లి 100 పడకల ఆస్పత్రిని శనివారం సాయంత్రం సందర్శించారు. బాలికలతో మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్​రవికుమార్, ఇతర వైద్యులతో మాట్లాడి బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం బాలికల హాస్టల్​ను సబ్​కలెక్టర్​మనోజ్ తో కలిసి తనిఖీ చేశారు. 

హాస్టర్​ సంక్షేమాధికారి సుజాతను మందలించారు. ఘటనకు కారణాలు తెలపాలని ఆమెకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. హాస్టల్​లోని అన్ని గదులు, పరిసరాలు, కిచెన్​ను తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్​  దుర్గాప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

బాలికలకు పరామర్శించిన ఎమ్మెల్యే​

బాలికలు చికిత్స పొందుతున్న హాస్పిటల్​ను ఎమ్మెల్యే గడ్డం వినోద్​ఉదయం సందర్శించి వారిని పరామర్శించారు. బాలికలను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్​కుమార్​దీపక్​తో ఫోన్​లో  మాట్లాడి పరిస్థితిని వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బాలికల హాస్టల్​ను సందర్శించి కిచెన్, ఆహార నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. 

ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆస్పత్రిని సందర్శించి బాలికలను పరామర్శించారు.