తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి.. వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగుచేయాలి: డిప్యూటీ సీఎం భట్టి

తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి.. వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగుచేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
  • ఎల్‌‌‌‌నినో నేపథ్యంలో అప్రమత్తత అవసరం
  • పగటిపూట సోలార్ విద్యుత్‌‌‌‌ను వాడాలి 
  • రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో సబ్జెక్ట్ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌తో అవగాహన సదస్సు
  • సామాజిక బాధ్యతతో జిల్లాలవారీగా సెమినార్లు నిర్వహించాలని భట్టి సూచన


హైదరాబాద్​, వెలుగు: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ‘ఎల్‌‌‌‌నినో’  రాష్ట్ర జీవన విధానం, వాతావరణంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో  ప్రజలు, రైతాంగం ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌‌‌‌లోని రవీంద్ర భారతిలో ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ‘ఎల్‌‌‌‌నినో ప్రభావం -–ముందస్తు జాగ్రత్తలు’ అనే అంశంపై  సబ్జెక్ట్ ఎక్స్‌‌‌‌పర్ట్స్, శాస్త్రవేత్తలతో నిర్వహించిన ఉన్నతస్థాయి అవగాహన సదస్సులో భట్టి విక్రమార్క మాట్లాడారు. కేవలం ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కాకుండా, ఎల్‌‌‌‌నినోతో  ఉత్పన్నమయ్యే వర్షాభావ పరిస్థితుల భారాన్ని తట్టుకునేలా ప్రజలు తమ స్థాయిల్లో సొంత ప్రణాళికలు రూపొందించుకోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశామని తెలిపారు.

తాగు, సాగునీరు, విద్యుత్ వాడకం, పశుపక్ష్యాదుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యక్తులు, కుటుంబ, మండల, జిల్లా స్థాయిలో ప్రణాళికలతో ముందుకు సాగితేనే ఎల్‌‌‌‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు.

 ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలి..

ఎల్‌‌‌‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను ఎంచుకోవడం ద్వారా రైతాంగం ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని సదస్సులోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు స్పష్టంగా వివరించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. నీటి వనరుల లభ్యత ఆధారంగా రైతులు పంటల సమగ్ర ప్రణాళికను మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఈ సెమినార్‌‌‌‌లో నిపుణులు అందించిన అమూల్యమైన సమాచారాన్ని, సూచనలను సామాజిక బాధ్యతగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా పల్లెపల్లెకూ చేరవేయాలని కోరారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల వద్ద కూర్చొని ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న ప్రజలు, రైతులు తమ రాబోయే సాగు కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నష్టపోకుండా ఉండేందుకు తగిన నిర్ణయాలు తీసుకోగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

హైడల్ పవర్ ఉత్పత్తి తీవ్రంగా తగ్గింది..

వర్షాభావ పరిస్థితులతో దేశవ్యాప్తంగా హైడల్ పవర్ ఉత్పత్తి తగ్గిపోయి, విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి కాలం తరహాలోనే వర్షాకాలంలోనూ ఏసీలు, ఫ్యాన్లు, మోటార్ల వాడకం పెరిగి పీక్ డిమాండ్ ఏర్పడుతోందని, ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారాన్ని మోపుతోందని తెలిపారు. కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ ధరకు అందుబాటులో ఉండే సోలార్ విద్యుత్‌‌‌‌ను పగటిపూటే ఎక్కువగా వినియోగించుకోవాలని ఆయన వ్యవసాయ, ఉద్యానవన రైతులను కోరారు.

జిల్లాల్లోనూ అవగాహన సదస్సులు

జిల్లాస్థాయిల్లో కూడా ప్రజలకు, రైతులకు ఎల్‌‌‌‌నినో ప్రభావంపై అవగాహన సదస్సులు కండక్ట్ చేయాలని, అధికారులంతా బాధ్యతాయుతంగా ముందస్తు ప్లానింగ్‌‌‌‌తో ముందుకు వెళ్లాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వ్యవసాయంపైనే కాకుండా సమాజంలో భాగమైన పాడి పశువులు, పెంపుడు జంతువులు, పక్షులు,  అడవుల్లో ఉన్న జీవరాశుల నీటి, ఆహార అవసరాలపై కూడా ప్రత్యేకంగా చర్చించారు.

వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఈ మూగజీవాలు తీవ్రమైన తాగునీటి ఎద్దడికి, గ్రాసం కొరతకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా భట్టి ప్రస్తావించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు, అధికారులు ముందస్తుగానే పశుగ్రాసం, నీటి వనరుల లభ్యతపై పక్కా ప్రణాళికతో ఉండాలని సూచించారు.