నిజామాబాద్, వెలుగు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చెవిలో ఊదగానే నిజామాబాద్ గడ్డపై నోరు విప్పిన సీఎం రేవంత్‌రెడ్డి తన అవగాహనలేమిని మరోసారి చాటుకున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. శనివారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ అభ్యర్థుల పక్షాన నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి స్మార్ట్ సిటీ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే కేంద్రానికి చేరుతాయని, అది ఎంపీలు చేసే పని కాదన్నారు. నిజామాబాద్‌కు అమృత్ స్కీమ్ తీసుకొచ్చి రూ.400 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీకి ఫెవికాల్ బంధం ఉందన్నారు.
కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడే వ్యక్తి సీఎంగా ఉండటానికి అనర్హుడన్నారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ స్కీమ్‌ల కింద మరో రూ.50 వేల కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను, ఈకార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఉన్న కేటీఆర్‌ను ఎందుకు జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. ప్యాకేజీలు తీసుకుని వ్యక్తిత్వాన్ని అమ్ముకునే సీఎం రాష్ట్రాన్ని నడపడం బాధాకరమన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డితో కలిసి కరప్షన్‌కు దూరంగా పని చేస్తున్నామన్నారు. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ 11న జరిగే పోలింగ్‌తో గేమ్ చేంజ్ చేస్తామన్న వ్యాఖ్యలు దేనికి సంకేతమో చెప్పాలని ప్రశ్నించారు. నిజామాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
