- ఆమెకు ఇప్పటికి రెండు సార్లు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది.
- అలాంటామె దృఢ నిశ్చయం గల వ్యక్తిత్వం, వైద్య స్థిరత్వం గురించి చాటిచెప్పేందుకు
- యాత్ర మొదలుపెట్టింది. రాత్రిపూట క్యాంపింగ్, సర్కిల్ క్రాసింగ్ చేసి అంటార్కిటికా
- యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఇలాంటి అడ్వెంచర్
- చేసిన మొదటి వ్యక్తిగా స్నేహ భూపతి రాజు చరిత్ర సృష్టించింది.
ఈ హిస్టారికల్ జర్నీ అర్జెంటీనాలోని ఉషువైయా నుంచి 2025 డిసెంబర్17న ప్రారంభమైంది. అత్యంత కఠినమైన డ్రేక్ పాసేజ్‌ను దాటి అంటార్కిటికా పెనిన్షులాకు చేరుకుంది. డిసెంబర్19న బారియెంటోస్ ద్వీపంలో మొదటి ల్యాండింగ్ జరిగింది. తర్వాత పోర్టల్ పాయింట్లో అధికారిక ల్యాండింగ్ జరిగింది. డిసెంబర్ 20న సాయంత్రం స్నేహ రాజు పోర్టల్ పాయింట్లో అంటార్కిటికా ఖండంపై రాత్రిపూట క్యాంప్ చేసింది. తర్వాత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా డీటైల్ ద్వీపంపై అడుగుపెట్టి సర్కిల్‌ను విజయవంతంగా దాటింది. స్నేహ రాజు వైద్య సవాళ్లను ఎదుర్కొని కూడా స్థిరత్వం, దృఢనిశ్చయంతో ఇది కూడా సాధ్యమే అని నిరూపించింది.
మూడేండ్ల వయసులోనే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడిన ఈమె బాల్యం ఆసుపత్రి హాల్‌వేలు, డయాలసిస్ వార్డుల్లో గడిచింది. ఏడేండ్ల వయసులో మొదటిసారి కిడ్నీ మార్పిడి చేయించుకుంది. 2013లో కాలేజీ చివరి సంవత్సరంలో సెరిబ్రల్ మలేరియా సమస్యల వల్ల మొదటి గ్రాఫ్ట్ దెబ్బతినడంతో రెండోసారి మార్పిడి చేయించుకుంది. ఈ అనుభవాలు ఆమెలో బతికేందుకు కాకుండా లక్ష్యాలను సాధించే ఉద్దేశ్యాన్ని పెంపొందించాయి. తన మెడికల్ హిస్టరీ లైఫ్‌ని డిసైడ్ చేయకుండా క్రమశిక్షణ, ధైర్యంతో ఆమె ఆశయాలను కొనసాగించారు. ‘‘అవయవ మార్పిడి అంతం కాదు, కొత్త ప్రారంభమ’’ని నిరూపించింది హైదరాబాద్‌లోని ఎన్‌సీసీ లిమిటెడ్‌లో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డిప్యూటీ హెడ్‌గా పనిచేస్తోన్న స్నేహ.
పర్వతాల్లో సాధారణ ట్రెక్‌తో మొదలైన ప్రయాణం, రికార్డు సృష్టించేందుకు నాంది పలికింది. కాలా పత్తార్, కాశ్మీర్ గ్రేట్ లేక్స్ వంటి ఎత్తైన యాత్రల నుంచి, చదర్ ట్రెక్ వరకు.. ఆమె రెండుసార్లు మూత్రపిండ మార్పిడి చేయించుకున్న వ్యక్తిగా ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందింది. యాత్రలతో పాటు స్నేహ రాజు అవయవ దానం కోసం నిబద్ధతతో పనిచేస్తోంది. ఆమె జీవిత అనుభవాలు, స్థిరత్వ ప్రయాణం గురించి వసుంధర రాఘవన్ “కిడ్నీ వారియర్స్, ఎడిషన్ 2: స్టోరీస్ ఆఫ్ లివ్డ్ ఎక్స్‌పీరియన్సెస్ పేవ్ ది ఫ్యూచర్ ఆఫ్ సోషల్ ఎంటర్‌ప్రైజ్ ఇన్ ఇండియా” పుస్తకంలో అందంగా రాశారు. ఈరోజు స్నేహ రాజు కేవలం ఎక్స్‌ప్లోరర్‌గా మాత్రమే కాకుండా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నిలుస్తోంది. వైకల్యం.. మన సామర్థ్యం, ఆశయం లేదా కలలు కనే హక్కును కోల్పోనివ్వదని గుర్తుచేస్తుంది.
