కిచెన్ తెలంగాణ: ఫ్రెష్ గా, టేస్టీగా, నచ్చిన ఫ్లేవర్స్ తో ఇంట్లోనే చేసుకునే చాక్లెట్ రెసిపీస్..

కిచెన్ తెలంగాణ:  ఫ్రెష్ గా, టేస్టీగా, నచ్చిన ఫ్లేవర్స్ తో ఇంట్లోనే చేసుకునే చాక్లెట్ రెసిపీస్..

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినే చాకొలెట్.. ఇంట్లో చేసుకోలేమా? ఫ్రెష్​గా, టేస్టీగా, మనకు నచ్చిన ఫ్లేవర్స్​తో చేసుకుని తింటే ఎంత బావుంటుందో కదా! మరి ఇంకేం ఈ వీకెండ్ చాకొలెట్స్​ తయారుచేసుకోవడానికి రెడీ అయిపోండి.

కేరమెల్ టోఫీ

కావాల్సినవి :
చక్కెర: రెండు కప్పులు
క్రీమ్: ఒక కప్పు
సాల్టెడ్ బటర్ (వెన్న):
మూడు టేబుల్ స్పూన్లు

తయారీ: పాన్​లో చక్కెర వేసి కరిగించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక అందులో క్రీమ్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సాల్టెడ్ బటర్ వేసి కలపాలి. ఒక గిన్నెలో బటర్ పేపర్ వేసి అందులో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఐదు గంటలపాటు చల్లారనివ్వాలి. అంతే.. సింపుల్, టేస్టీ కేరమెల్ టోఫీ రెడీ.

పిస్తా కునాఫా

కావాల్సినవి:
వైట్, డార్క్​ చాకొలెట్స్: ఒక్కోటి మూడు టేబుల్ స్పూన్లు
పిస్తా, సేమ్యా : ఒక్కోటి 50 గ్రాముల చొప్పున
నువ్వులు, చక్కెర, నూనె,
వెన్న: ఒక్కో టేబుల్ స్పూన్
ఉప్పు: సరిపడా, పాలు: 
రెండు టేబుల్ స్పూన్లు
వెనీలా ఎసెన్స్: 
ఒక టీస్పూన్

తయారీ: పాన్​లో పిస్తా పప్పుల్ని వేగించాలి. తర్వాత నీళ్లలో వేసి కాసేపయ్యాక పొట్టును తీయాలి. మిక్సీజార్​లో నువ్వులు, చక్కెర, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. అందులోనే పిస్తా పప్పులు, నూనె, వెనీలా ఎసెన్స్ వేసి, పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి. పాన్​లో వెన్న వేడి చేసి అందులో సేమ్యా వేసి వేగించాలి. ఆ సేమ్యాని పిస్తా మిశ్రమంలో వేసి కలపాలి. వైట్, డార్క్ చాకొలెట్స్​ని వేడి చేసి కరిగించాలి. ఆ చాకొలెట్ మిశ్రమాన్ని మౌల్డ్స్​లో పోసి పది నిమిషాలు ఫ్రిజ్​లో పెట్టాలి. ఆ తర్వాత పిస్తా మిశ్రమాన్ని వేసి దానిపై మరో లేయర్​లా చాకొలెట్​తో కవర్ చేయాలి. ఫ్రిజ్​లో అరగంటసేపు ఉంచాలి. 

కోకోనట్ బౌంటీ

కావాల్సినవి:
పాలు: ఒకటిన్నర కప్పు
చక్కెర: ముప్పావు కప్పు
కొబ్బరి పొడి: రెండు కప్పులు
క్రీమ్: పావు కప్పు
చాకొలెట్: 300 గ్రాములు

తయారీ : పాన్​లో పాలు పోసి కాగబెట్టాలి. పాలు కాగాక చక్కెర వేసి కరిగించాలి. తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి కలపాలి. ఆపై క్రీమ్ వేసి మరోసారి బాగా కలపాలి. మిశ్రమం కాస్త దగ్గర పడ్డాక ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి. కాసేపు చల్లారాక ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని వేలెడంత బార్స్​లాగ తయారుచేయాలి. వాటిని ఒక ప్లేట్​లో పెట్టి గంటసేపు ఫ్రిజ్​లో పెట్టాలి. ఒక గిన్నెలో చాకొలెట్స్ వేసి కరిగించాలి. కాస్త చల్లారాక అందులో తయారుచేసుకున్న కోకోనట్ బార్స్​ను ముంచాలి. వాటిని మరో గంటసేపు ఫ్రిజ్​లో పెడితే సరిపోతుంది.