క్రైం థ్రిల్లర్ కథ : బస్సు నెంబర్ 375ను దెయ్యాలు మాయం చేశాయా.. 30 ఏళ్లుగా బస్సు ఎందుకు దొరకలేదు..!

క్రైం థ్రిల్లర్ కథ : బస్సు నెంబర్ 375ను దెయ్యాలు మాయం చేశాయా.. 30 ఏళ్లుగా బస్సు ఎందుకు దొరకలేదు..!

అది 1995, నవంబవర్ 14, టైం రాత్రి పదకొండు. రోజూలాగే వాంగ్ యూ కోసం అతని తండ్రి డిన్నర్ చేయకుండా ఎదురుచూస్తున్నాడు. పదిహేడేళ్ల ఆ కుర్రాడు కాలేజీ అయిపోయాక.. ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పార్ట్ టైం జాబ్ చేస్తుంటాడు. ఆరోజు మరీ లేట్ కావడంతో కొడుకు కోసం టెన్షన్ పడుతుంటాడు తండ్రి.

ఇంతలో ఫోన్ రింగ్ కావడంతో ఇంట్లోకి పరిగెత్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆ పెద్దాయన.  అవతలి నుంచి వాయిస్..  'మీ అబ్బాయి హైద్రిన్ పోలీస్ హెడ్ స్టేషన్ దగ్గర ఉన్నాడు. వచ్చి తీసుకెళ్లండి' అని చెప్తుంది. అది విని 'ఏం జరిగిందో ?' అనే ఆందోళనతో మోటార్ బైక్ పై  స్టేషనికి చేరుకున్నాడు ఆ తండ్రి. స్టేషన్ బయట ఉన్న వాంగ్.. పక్కనే ఉన్న ఓ పెద్దాయనతో భయం భయంగా మాట్లాడుతున్నాడు. తండ్రిని చూసిన వెంటనే కౌగిలించుకుని "మేం దెయ్యాల్ని చూశాం"అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు.
 
విచిత్రమైన వేషాలు!!
వాంగ్ యూ డ్యూటీ రెగ్యులర్ గా సాయంత్రం. ఏడింటికే అయిపోవాలి. కానీ, ఆరోజు అయిపోయే సరికి ఎనిమిదిన్నర దాటింది. తొమ్మిది దాటితే అతని ఇంటికి వెళ్లే రూట్ లో బస్సులు ఉండవు. వాంగ్ యూ ఇంటికి చేరాలంటే గంటన్నర ప్రయాణం. అందుకే లాస్ట్ బస్ కోసం బస్టాప్ లో  నిల్చున్నాడు. ఇంతలో ఓ పెద్దాయన కూడా అదే బస్టాప్ కి వచ్చాడు. పరిచయం లేకపోయినా ఇద్దరే ఉండడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. 

ఇంతలో 375 నెంబర్ బస్ వచ్చింది. యువాన్ మింగ్ నుంచి హువాన్ రూట్ లో వెళ్లే సర్వీస్ అది. లాస్ట్ ట్రిప్ కావడంతో డ్రైవర్, లేడీ కండక్టర్ మాత్రమే ఉన్నారు. వాంగ్, ఆ పెద్దాయన ఇద్దరూ ఎక్కారు. కొద్దిదూరం వెళ్లాక మరో బస్టాప్ లో ఒక జంట ఎక్కింది. చలికాలం.. పైగా కొండ ప్రాంతం గుండా జర్నీ కావడంతో కిటికీల నుంచి చల్లనిగాలి వీస్తోంది. ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత రోడ్డు పక్కన దూరంగా చీకట్లోంచి ఇద్దరు వ్యక్తులు 'బస్ ఆపమంటూ' కేకలు వేస్తున్నారు. బస్ లైట్ల వెలుతురులో రెండు నీడల్ని చూసి ఆపాడు డ్రైవర్. ఆ ఇద్దరు స్పృహ లేని ఒకతన్ని తమ భుజాలపై వేసుకుని మోసుకొచ్చారు. వాళ్ల బట్టలు, జుట్టు చూడటానికి విచిత్రంగా ఏదో రాజుల కాలానికి చెందినట్లు ఉన్నాయి. ముఖాలు తెల్లని పెయింట్ పూసినట్లు ఉన్నాయి. ఆ అవతారాలు చూసి బస్సులో ఉన్న నలుగురు ప్యాసింజర్లు భయపడ్డారు. కండక్టర్తో వాళ్లను ఎక్కించుకోవద్దని రిక్వెస్ట్ చేశారు. అయితే వాళ్లు ఆర్టిస్టులు కావొచ్చని, ఈ రాత్రి రోడ్డులో వాళ్లని అలా వదిలేయడం సరికాదని ప్యాసింజర్లకు సర్దిచెప్పింది ఆ కండక్టర్. ఇంతలో నెక్స్ట్ స్టాప్ లో జంట దిగిపోయింది. మరో పదినిమిషాల తర్వాత ఆ పెద్దాయన ఉన్నట్లుండి గట్టిగా అరుస్తూ వాంగ్ యూ మీదకి లేచాడు.

వాంగ్ ని  కాపాడాడా?
వాంగ్ తో గొడవ పడుతూ..' నా పర్స్ ఎందుకు తీశావ్' అని గోల చేశాడు ఆ పెద్దాయన. అయితే వాంగ్ కి ఏం జరుగుతుందో అర్ధంకాక సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాడు. కానీ, ఆ పెద్దాయన అరుపులకు చిర్రెత్తుకొచ్చిన బస్ డ్రైవర్ మాత్రం వాళ్లను దింపేయమని కండక్టర్ తో  చెప్పాడు. దీంతో ఆమె వాళ్లిద్దరినీ దించేసింది. అయితే బస్సు దిగిన తర్వాత వాంగ్, ఆ పెద్దాయనతో గొడవకి దిగబోయాడు. కానీ, ఆ పెద్దాయన మాత్రం భయంగా 'నేను నీ ప్రాణాలు కాపాడాను. ఆ బస్సులో ఎక్కింది దెయ్యాలు. వాళ్లకు కాళ్లు లేవు. నువ్వు గమనించలేదా?" అని చెప్పాడు. బిత్తరపోయిన వాంగ్, ఆ పెద్దాయనతో కలిసి దగ్గర్లోని హైద్రిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అయితే పోలీసులు వాళ్లు చెప్పింది నమ్మలేదు. పైగా వాళ్లిద్దరిని పిచ్చోళ్లంటూ బయటకు పంపించేశారు. ఓ ఆఫీసర్ మాత్రం వాంగ్ ఇంటికి ఫోన్ చేసి, అతని తండ్రికి కబురు అందించాడు.

సెన్సేషన్ కేసు
వాంగ్ కి విచిత్రమైన అనుభవం ఎదురైన ఆ మరుసటి ఉదయం ఆ బస్ కంపెనీవాళ్లు పోలీసులకు ఒక కంప్లయింట్ చేశారు. 'గత రాత్రి బస్ నెంబర్ 375 లాస్ట్ ట్రిప్ ముగించుకుని డిపోకి తిరిగిరాలేదు. డ్రైవర్, టికెట్ కలెక్టర్ కూడా మిస్ అయ్యారు' అని. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. వాంగ్, ఆ పెద్దాయన్ని వెతికి పట్టుకున్నారు. ఎంక్వయిరీలో జరిగింది ఏంటో మొత్తం వివరించి చెప్పారు వాళ్లిద్దరూ. దీంతో లోకల్ న్యూస్ ఛానెల్స్ వాళ్లను ఇంటర్వ్యూలు చేసేందుకు ఎగబడ్డాయి. అదే టైంలో యువాన్ మింగ్ ఏరియా జనాల్లో మెల్లగా దెయ్యం భయం మొదలైంది. దీంతో ఇది ఒక సెన్సేషన్ కేసుగా ప్రచారం జరిగింది.

అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజుల తర్వాత ఆ బస్సు జాడ తెలిసింది. వాంగ్, ఆ పెద్దాయన్ని దించేసిన ప్లేస్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జియాంగ్ షాన్ (ఫ్రాగ్రాంట్ హిల్స్) అమ్యూజ్ మెంట్ రిజర్వాయర్ లో బస్సు శకలాల్ని పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆ బస్సు నుంచి మూడు కుళ్లిపోయిన డెడ్ బాడీల్ని వెలికితీశారు. వాటిలో ఒకటి లేడీ కండక్టర్, మరొకటి డ్రైవర్. మూడోది ఎవరిదన్నది తేలలేదు. పైగా ఈ కేసులో పోలీసులకు బోలెడన్ని అనుమానాలు మొదలయ్యాయి. 

మొదటిది.. బస్సు ఆరోజు ఉదయం ఫిల్లింగ్ స్టేషన్ కి వెళ్లలేదు. కాబట్టి, అంతదూరం ట్రావెల్ చేయడానికి సరిపడినంత డీజిల్ ఉండదు. రెండోది.. బస్సు ట్యాంకులో డీజిల్ కి బదులు రక్తంతో నిండి ఉంది. మూడోది... బస్సులో బాడీలు మరీ దారుణంగా కుల్లిపోయిన స్టేజ్లో బయటపడ్డాయి. కానీ, రెండే రోజుల్లో బాడీలు అంతలా డీకంపోజ్ అయ్యే ఛాన్నే లేదు. పైగా రిజర్వాయర్ పరిధిలో ఉన్న సెక్యూరిటీ  కెమెరాలన్నింటిలో బస్సు వెళ్లినట్లు రికార్డ్ కాలేదు. పక్కనే హైవేకి దగ్గరగా ఉన్న కొన్ని ఇండ్ల వాళ్లను ప్రశ్నించారు. వాళ్లెవరూ అటు వైపుగా బస్సు వెళ్లడం చూడలేదనే చెప్పారు. దీంతో జనాల్లో దెయ్యం భయం మరింతగా పెరిగింది..

రకరకాల వెర్షన్స్
బీజింగ్ బస్ మిస్సింగ్ కేసు... రెండేళ్లపాటు పోలీసులని  విడిచిపెట్టలేదు. చివరికి ఎంతకీ ఓ కొలిక్కి రాకపోవడంతో ఈ కేసును క్లోజ్ చేశారు. తిరిగి 2013లో వాంగ్ యూని వెతికి, అతని ఇంటర్వ్యూతో ఆనాటి బస్సు మిస్సింగ్ కేసులో కీలక సాక్షిగా ఉన్న వాంగ్.. బస్సు డ్యామ్ లో దొరికిందన్న విషయం తెలియదని చెప్పడం కొసమెరుపు. అలాగే 'ఎట్రాసిటస్' అనే హారర్ ఇన్సిడెంట్స్ తో ఉన్న బ్లాగ్ ఒకటి ఈ బస్ మిస్సింగ్ కేసు గురించి రకరకాల వెర్షన్ కథలని పబ్లిష్ చేసింది. వాంగ్ యూతో ఆరోజు ఉంది ఒక ఓల్డ్ లేడీ అని ఒక స్టోరీ. ఆ బస్సు డ్యామ్లో కాకుండా ఒక పాడుబడ్డ బస్టాప్ దగ్గర దొరికిందని ఒక స్టోరీ, డ్యామ్ దగ్గర బస్సు గాల్లో వెళ్లినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు ఒక స్టోరీ.. ఇలా రకరకాల వెర్షన్స్ ను పబ్లిష్ చేసింది. అయితే ఈ వెర్షన్స్ లో చాలావరకు ఫేక్ ఉన్నప్పటికీ.. అంతిమంగా బస్సు మిస్సింగ్ ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందనే ప్రచారాన్ని మాత్రం కొన్ని మీడియా హౌజ్ లో అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాయి. బస్సులో దొరికిన మూడో బాడీకి సంబంధించిన మర్డర్ కేసు అయి ఉంటుందని కొందరు, కాదు.. ఇది చిన్నపిల్లల్ని భయపెట్టే ఒక కల్పిత కథ అని మరికొందరు....

'ఇదంతా ట్రాష్, బస్సు కనిపించకుండా పోవడం అనేది అసలు జరగనేలేదని కొట్టిపడేశారు ఇంకొందరు. అప్పటి నుంచి '375' అనే నెంబర్ సెంటిమెంట్ మంచిది కాదని చాలా బస్సు కంపెనీలు ఫీలయ్యాయి. బీజింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాచోట్ల '375' అనే నెంబర్ సర్వీసులు ఇప్పటికీ కనిపించవు.

క్యూయింగ్ రాజు పగ 
'ది బస్ టు ఫ్రాగ్రాంట్ హిల్స్'.. బీజింగ్ (చైనా) లో బాగా పాపులర్ అయిన ఓ దెయ్యం కథ. దెయ్యాలు ఒక బస్సును మాయం చేశాయని, అర్ధరాత్రిళ్లు అప్పుడప్పుడు ఫ్రాగ్రాంట్ హిల్స్ చుట్టుపక్కల ఉన్న ఊళ్లలో అది కనిపించి.. మాయం అవుతుందని ఒక ప్రచారం నడుస్తోంది. కానీ, ఇది కథ కాదు.. ఒక రియల్ ఇన్సిడెంట్ అని వాదించేవాళ్లూ ఉన్నారు. 1995లో ఒక ఖాళీ సర్వీస్ బస్సు డ్రైవర్, కండక్టర్ తో  సహా కనిపించకుండా పోవడం, ఆ కేసు పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ కావడం, రెండు రోజులకు ఓ ఎమ్యూజ్మెంట్ పార్క్ రిజర్వాయర్ లో అది దొరకడం, అందులో మూడు మృతదేహాలు డీకంపోజ్ అయి దొరకడం ఇలా ట్విస్టులు, ప్రశ్నలతో ఈ కేసు ఒక చిక్కుముడిగా ఉండిపోయింది. అన్నింటికీ మించి ఓ పెద్దాయనతో కలిసి వాంగ్ యూ ఇచ్చిన స్టేట్మెంట్.. దీన్నొక దెయ్యం కథగా ప్రచారం చేసింది. కొన్ని చైనీస్ మీడియా హౌజ్ ల కథనాల ప్రకారం అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే....

 2016లో అమెరికా రైటర్ నైటింగ్ డేన్.. ఈ ఇన్సిడెంట్ ని రియల్ అని పేర్కొంటూ 'ది మిడ్ నైట్ బస్ 375' అనే బుక్ రాశాడు. అది పాజిటివ్ రివ్యూలతో విపరీతంగా సేల్ అయ్యింది. మరోవైపు మన దేశంలోనూ ఈ మిస్సింగ్ పై యూట్యూబ్ వీడియో రివ్యూలు, డాక్యుమెంటరీలు చాలానే వచ్చాయి.

చైనాలో ప్రతీ సెప్టెంబర్లో జరిగే 'ఘోస్ట్ ఫెస్టివల్'లో ప్రాగ్రాంట్ హెల్ప్ ఘోస్ట్ వేషాలు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తుంటాయి. ఇదంతా పక్కనపెడితే.. బీజింగ్ బస్సు మిస్సింగ్ ఇన్సిడెంట్ ఒక కుట్రనా ? లేదంటే జనాలు నమ్మి భయపడుతున్నట్లు నిజంగా దెయ్యాలు చేసినా పనా? జరిగింది కళ్లారా చూసిన మనుషులు ఉండి కూడా పాతికేళ్లు గడుస్తున్నా.. ఈ 'దెయ్యాల' మిస్టరీ గుట్టు ఏంటో వీడకపోవడం విశేషం.

-శుభాశ్రీ