కాంగ్రెస్ కే పట్టం కట్టాలి : మంత్రి అజారుద్దీన్

కాంగ్రెస్ కే పట్టం కట్టాలి  : మంత్రి అజారుద్దీన్

కామారెడ్డి టౌన్, వెలుగు :  కామారెడ్డి పట్టణ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టాలని మంత్రి అజారుద్దీన్ పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని 19, 20, 21, 22, 23, 24వ వార్డుల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్​సర్కార్​ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.  బీజేపీ, బీఆర్ఎస్ లు రెండు ఒకటేనని వారికి బుద్ధి చెప్పాలన్నారు. రుణమాఫీ తో పాటు ఉచిత బస్సు, కరెంట్ బిల్లు తదితర ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని, రేవంత్​ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

అనంతరం మహిళా కమిషన్ చైర్మన్ శారద మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అండగా ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాకే కామారెడ్డిలో అభివృద్ధి జరిగిందని, మరోమారు కౌన్సిలర్లను గెలిపించి మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు.  మహారాష్ట్ర కి చెందిన ఎమ్మెల్యే  శ్రావణ్ మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు, ప్రజలు పాల్గొన్నారు.