ఈ డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా అంతులేని ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తోంది. అందుకే కొంతమంది టైం తెలియకుండా గంటల తరబడి స్క్రీన్‌ని స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అయితే, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ వెనుక ‘బ్రెయిన్ రాట్’ అనే ఒక సమస్య కూడా దాగి ఉంది. వాస్తవానికి ఇది డాక్టర్లు గుర్తించిన మానసిక రోగం కాదు. కానీ.. దీనివల్ల మెదడు సామర్థ్యం తగ్గుతోందని ఈ మధ్య వచ్చిన స్టడీల్లో తేలింది. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అల్గారిథమ్‌లు నిరంతరం మనల్ని ఆకర్షిస్తుంటాయి. దాంతో స్క్రీన్ టైం పెరుగుతోంది. కొందరైతే ఫోన్‌లో నిమగ్నమై టైం తెలియకుండా వీడియోలు చూస్తుంటారు. కొందరు డూమ్‌స్క్రోలింగ్ చేస్తుంటారు. అంటే సోషల్ మీడియా, న్యూస్ యాప్‌లలో నిరాశ, నెగటివిటీ పెంచే కంటెంట్ స్క్రోల్ చేస్తూ ఉండటం. ఇలాంటి వాటివల్ల మెదడు సామర్థ్యం తగ్గుతుంది. ఆలోచించే, మాట్లాడే విధానంపై ప్రభావం పడుతుంది. ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ వల్ల మానసిక అలసట వస్తుంది. ఏకాగ్రత తగ్గుతుంది. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలు క్షీణిస్తాయి. ముఖ్యంగా షార్ట్ ఫార్మాట్ వీడియోలు ఎక్కువగా చూడడం వల్ల అభిజ్ఞా క్షీణత (కాగ్నిటివ్ డిక్లైన్) పెరుగుతుంది. ఇది జ్ఞానం, ఆలోచన, అవగాహన, జ్ఞాపకశక్తి, తార్కికానికి సంబంధించిన మానసిక ప్రక్రియ. అభిజ్ఞా క్షీణిస్తే.. కొత్త విషయాలు నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవడం లాంటివాటిలో వెనుకబడిపోతారు. ఇలాంటి స్థితినే బ్రెయిన్ రాట్ అంటారు. ఈ సమస్య యువతలో ఎక్కువగా కనిపిస్తోంది.
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో..
‘బ్రెయిన్ రాట్’ను ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ 2024లో దీన్ని ‘‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’’గా గుర్తించింది. బ్రెయిన్ రాట్ అంటే మానసిక లేదా మేథో స్థితి క్షీణించడం అని అర్థం. బ్రెయిన్ రాట్ అనే పదాన్ని మొదటిసారి 1854లో అమెరికన్ రచయిత, తత్త్వవేత్త హెన్రీ డేవిడ్ థోరో ఉపయోగించారు. తన పుస్తకం వాల్డెన్‌లో సమాజంలో ఆలోచనా విధానాలు మారడాన్ని విమర్శిస్తూ ఈ పదం రాశారు.
ఎందుకు వస్తుంది?
స్క్రీన్ టైం పెరగడమే బ్రెయిన్ రాట్‌కు కారణం అయినప్పటికీ ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు? అనేది కూడా ముఖ్యమే. షార్ట్ వీడియోలు, రీల్స్ స్క్రోలింగ్ లేదా బ్రౌజర్ ట్యాబ్‌లు మార్చడం, చాటింగ్ లాంటి మల్టీటాస్కింగ్ వల్ల మెదడు ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది. సోషల్ మీడియా అల్గారిథమ్‌లు మెదడులో డోపమైన్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. దాంతో బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అలాంటివాళ్లు చాలాసేపు విరామం లేకుండా ఉద్రేకంతో స్క్రీన్‌ని చూస్తారు. ఇది నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. అడిక్షన్‌కు దారి తీస్తుంది. మెదడు న్యూరల్ పాథ్‌వేలను మార్చి ముందుచూపు, ఆలోచన సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. ఇవన్నీ బ్రెయిన్ రాట్‌కు దారి తీస్తాయి.
జంక్‌ఫుడ్ లాంటిది
షార్ట్ వీడియోలు చూస్తున్నప్పుడు ఒక్కో వీడియోలో ఒక్కో రకమైన కంటెంట్‌ని చూస్తుంటాం. అలాంటప్పుడు బ్రెయిన్‌కు ఒకేసారి ఎన్నో కొత్త విషయాలను ఫీడ్ చేసినట్టు అవుతుంది. పైగా వెంట వెంటనే స్క్రీన్‌ని స్క్రోల్ చేయడం వల్ల మనం వాటిని అర్థం చేసుకునేంత టైం దానికి ఇవ్వడం లేదు. అంటే.. రోజంతా జంక్ ఫుడ్ తింటే జీర్ణ వ్యవస్థ ఎలా ఇబ్బంది పడుతుందో మెదడుని అనవసరమైన చెత్తతో నింపేస్తే దానిదీ అదే పరిస్థితి.
ఏ వయసులోనైనా..
సాధారణంగా వయసు మీద పడ్డాక మెదడు సమర్థత తగ్గుతుంది. అందులో భాగంగానే అల్జీమర్స్, చిత్తవైకల్యం లాంటి నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి. పదే పదే షార్ట్ ఫార్మాట్ వీడియోలు చూడడం వల్ల ఈ సమస్య ఏ వయసులోనైనా వచ్చే ప్రమాదం ఉంది. బ్రెయిన్ రాట్ అనేది ప్రవర్తనా,
లైఫ్‌స్టయిల్ వల్ల వచ్చే వ్యాధి.
ఎక్సర్‌సైజ్ అవసరం
రీల్స్ చూస్తే, మీమ్స్ స్క్రోల్ చేస్తే సరదాగా అనిపిస్తుంది. కానీ.. తక్కువ టైంలో ఎక్కువ వీడియోలు చూడటం వల్ల మెదడుకు నేర్చుకునే, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది. మనం కండరాలను బలంగా ఉంచుకోవడానికి రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటాం. మెదడు కూడా ఒక కండరం లాంటిదే. హెల్దీగా ఉండాలంటే అది కూడా ఎక్సర్‌సైజ్ చేయాల్సిందే. అందుకు కొత్త స్కిల్స్‌ని నేర్చుకోవడం లేదా మంచి పుస్తకం చదవడం లాంటివి చేయాలి. ఆలోచింపజేసే విషయాల వైపు దృష్టి మళ్లించాలి. మెడిటేషన్, సోషల్ ఇంటరాక్షన్‌లు మెదడు రివార్డ్ సిస్టమ్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి వాటిని అలవాటు చేసుకోవాలి.
నష్టాలెన్నో...
బ్రెయిన్ రాట్ వల్ల కంటి చూపు సామర్థ్యం తగ్గుతుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, బర్న్‌అవుట్ (దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల వస్తుంది), మోటివేషన్ లేకపోవడం, సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గడం లాంటివి గమనించొచ్చు. సెన్సిటివిటీ తగ్గుతుంది. సంబంధాలు దెబ్బతింటాయి. పేర్లు, తేదీలు,
ఈ మధ్య జరిగిన సంఘటనలను కూడా గుర్తుంచుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఇది వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.
ఇలా బయటపడొచ్చు!
బ్రెయిన్ రాట్ నుంచి బయటపడడం సాధ్యమే. హెల్దీ హ్యాబిట్స్‌కు మారడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. అవేంటంటే.. నిద్రవేళకు ముందు ఫోన్‌కు దూరంగా ఉండాలి. చదువుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు మొబైల్ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేసుకోవాలి. స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. అందుకోసం అప్లికేషన్‌లు, టూల్స్ ద్వారా స్క్రీన్ టైమ్ ట్రాక్ చేసుకోవాలి. ప్రతిరోజూ రీల్స్ చూడటానికి గడిపే సమయాన్ని తగ్గించుకోవాలి.
ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్లు బ్రేక్ తీసుకోవాలి. కాసేపు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్‌ను చూడాలి. ఈ టెక్నిక్ కంటిపై ఒత్తిడి తగ్గించి మానసిక అలసటను దూరం చేస్తుంది. స్ఫూర్తినిచ్చే లేదా మనస్సును ఉత్తేజపరిచే కంటెంట్‌ను మాత్రమే చూడాలి. అలాంటి సోషల్ మీడియా పేజీలు, చానెల్స్‌నే ఫాలో కావాలి. క్రాస్‌వర్డ్ పజిల్స్, సుడోకు, బ్రెయిన్ గేమ్స్ లాంటి వాటిమీద దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ 20-30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
లేదంటే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి చేస్తే మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఫుడ్‌లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను చేర్చుకోవాలి. వాటిలోని యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
