ఆదిలాబాద్ అభివృద్ధి కట్టుబడి ఉన్నాం : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ఆదిలాబాద్ అభివృద్ధి కట్టుబడి ఉన్నాం : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
  •     జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు
  •     ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి 

ఆదిలాబాద్/ఖానాపూర్, వెలుగు: ఆదిలాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ముఖ్యమంత్రి రేవంత్‌‌ రెడ్డి ఇటీవలే ఇక్కడ కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభించారని ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్​డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్​తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో దోచుకుని దాచుకోవడం తప్ప చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమీలేవన్నారు. 

బీజేపీ కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని, యువకుల భవిష్యత్​ను నాశనం చేస్తోందని మండిపడ్డారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని.. ఆ తర్వాత మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే ఇస్తోందన్నారు. వాటితోపాటు 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఫ్రీ బస్సు, పట్టణంలోని  మహిళలకు డ్వాక్రా లోన్లు వంటి కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలి కోరారు.  

ఖానాపూర్​లో రూ.52 కోట్లతో అభివృద్ధి పనులు

ఖానాపూర్ మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఖానాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఖానాపూర్ మున్సిపల్ కు రూ.52 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ.22 కోట్లతో అమృత్ పథకం కింద పట్టణంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి, రూ.15 కోట్లతో మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. 

ఆయా సమావేశాల్లో నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, బొజ్జు పటేల్, నరేశ్​జాదవ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మత్ హుస్సేని, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్​నియోజకవర్గ ఇన్​చార్జి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజీద్, మండల, పట్టణ కాంగ్రెస్​అధ్యక్షులు, నేతలు పాల్గొన్నారు.