- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం ఓ కన్వెన్షన్ హాల్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటరాక్టివ్ సెషన్ ఆన్ ఇండస్ట్రియల్ పొటెన్షియల్ ఆఫ్ ఆదిలాబాద్’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఉన్న అపారమైన పారిశ్రామిక సామర్థ్యాన్ని వినియోగించి రాబోయే రోజుల్లో కీలక పారిశ్రామిక కేంద్రంగా ఆదిలాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు.
పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న విద్యుత్ ఖర్చులు, సబ్సిడీల వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు, ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందన్నారు.10,000 ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, దీని ద్వారా నిరుద్యోగులకు పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.
జిల్లాలో కాటన్ ఆధారిత పరిశ్రమలకు మంచి అవకాశాలున్నాయని, పత్తి వ్యర్థాల నుంచి బ్రిక్వెట్స్, పెల్లెట్స్ తయారు చేసే గ్రీన్ ఇండస్ట్రీలకు జిల్లా అనుకూలంగా ఉందన్నారు. కుంటాల, పొచ్చర జలపాతాలు, నాగోబా ఆలయాన్ని కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐఐ ప్రతినిధులు శివప్రసాద్ రెడ్డి, సంజీవ్ దేశ్‌పాండే, సురేందర్ రావు, సమీ ఉద్దిన్, గౌతమ్ రెడ్డి, స్థానిక పరిశ్రమల సంఘాల సభ్యులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై కలెక్టరేట్లో శనివారం పోలింగ్ ఇన్‌చార్జ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లోని 216 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, నోడల్ అధికారి మనోహర్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
