V6 News

మల్లమ్మ కుంట రిజర్వాయర్ మాకొద్దు.. రైతుల ఆగ్రహం

మల్లమ్మ కుంట రిజర్వాయర్ మాకొద్దు.. రైతుల ఆగ్రహం

గద్వాల, వెలుగు: తుమ్మిళ్ల లిఫ్ట్ లో భాగంగా నిర్మించ తలపెట్టిన మల్లమ్మకుంట రిజర్వాయర్ మాకొద్దంటూ వడ్డేపల్లి మండలంలోని తనగల, పర్దిపురం గ్రామల రైతులు డిమాండ్ చేశారు. శనివారం 100 మంది రైతులు కలెక్టరేట్ ను ముట్టడించి కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు. రైతులు మాట్లాడుతూ.. మల్లమ్మ కుంట రిజర్వాయర్  నిర్మించేందుకు తనగల, పర్దిపురం గ్రామాల్లోని 600 ఎకరాలకు పైగా భూములను సేకరించాల్సి ఉంటుందని, అలా జరిగితే తమ బతుకులు అగమైపోతాయన్నారు.

ఇన్నేండ్లు చప్పుడు చేయకుండా ఎన్నికల ముంగిట రిజర్వాయర్ నిర్మిస్తామని జీవోలు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా రిజర్వాయర్ కోసం ప్రకటన చేయడాన్ని తప్పుపట్టారు. భూములకు డిమాండ్ ఉందని భూములు పోతే మళ్లీ భూమి దొరికే పరిస్థితులు లేవన్నారు.ఎట్టి పరిస్థితుల్లో తాము మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పేందుకే కలెక్టరేట్ ముట్టడించామని ప్రకటించారు.