దిస్పూర్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ పవన్ ఖేరాకు గౌహతి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సీఎం హిమాంత బిస్వా శర్మ భార్య రిణికి భూయాన్‌పై ఆరోపణల కేసులో పవన్ ఖేరాకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో నకిలీ పత్రాలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని.. నిజాలు వెలికితీయడానికి పవన్ ఖేరాకు కస్టడీ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. దీంతో పవన్ ఖేరాను అస్సాం పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశముంది.
వివాదం ఏంటంటే..?
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ భార్య రిణికి భూయాన్‌కు మూడు పాస్ట్ పోర్టులు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు అస్సాం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రిణికి భూయాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు పవన్ ఖేరాపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేసు నమోదైన అస్సాంలో సంబంధిత కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు వారం రోజులపాటు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు.
ALSO READ : బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
సుప్రీం కోర్టులో పవన్ ఖేరాకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. ట్రాన్సిట్ బెయిల్ కోసం అస్సాం హైకోర్టును ఆశ్రయించాలని పవన్ ఖేరాకు సూచించింది. సుప్రీం కోర్టు సూచనల మేరకు పవన్ ఖేరా అస్సాం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

