ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠ భరితమైన పోరుగా భావించే ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అయితే, ఈసారి ఈ పోరులో ఒక వెలితి కనిపిస్తోంది. ఇరు జట్ల స్టార్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ తుది జట్టులో లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. కాగా CSKపై అత్యధికంగా 913 పరుగులు చేసిన రోహిత్ లేకపోవడం ముంబైకి పెద్ద లోటు. అలాగే ఫినిషర్‌గా, మెంటార్‌గా ధోని లేకపోవడం చెన్నైకి ఇబ్బందికరమే. ఈ దిగ్గజాలు లేని సమయంలో యువ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి.
ధోని ఎందుకు ఆడటం లేదంటే?:
సీజన్ ప్రారంభం కాకముందే ప్రాక్టీస్ సమయంలో మహేంద్ర సింగ్ ధోని పిక్క గాయానికి (Calf Injury) గురయ్యాడు. ప్రస్తుతం అతడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, మ్యాచ్ ఆడే స్థాయికి ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. తాజా సమాచారం ప్రకారం, మే నెలలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. కానీ దీనిపై తుది నిర్ణయం ధోనినే తీసుకోవాల్సి ఉంది.
రోహిత్ శర్మ ఎందుకు దూరమైయ్యాడు?:
ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ హ్యామ్ స్ట్రింగ్ (Hamstring) గాయంతో బాధపడుతున్నాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన రోహిత్, వరుసగా మూడో మ్యాచ్‌కు దూరమయ్యాడు. నిన్నటి ప్రాక్టీస్‌లో రోహిత్ కేవలం చిన్నపాటి జోగింగ్ మాత్రమే చేశాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు అతను ఇంకా సిద్ధంగా లేడని మెడికల్ టీమ్ భావిస్తోంది. అతని స్థానంలో డానిష్ మలేవార్ జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), తిలక్ వర్మ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, AM గజన్‌ఫర్, అశ్వనీ కుమార్
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరి

