ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఫ్యామిలీకి ఆర్డీవో ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ మృతికి నివాళి అర్పించిన ఆర్డీవో..శంకర్ గౌడ్ ఫ్యామిలీకి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అంతేగాకుండా శంకర్ గౌడ్ కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. వీటితో పాటు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తన వ్యక్తిగతంగా రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయిన సంగతి తెలిసిందే..
మరో వైపు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇవాళ్టికి మూడో రోజుకి చేరింది. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో అన్ని డిపోల దగ్గర కార్మికులు ఆందోళనలు,ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు చోట్ల ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్, ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది ప్రభుత్వం.. కాంట్రాక్టు పద్దతిన డ్రైవర్లు, కండక్టర్లను నియమించి బస్సులను నడుపుతోంది.
ఈ క్రమంలో ఆర్మీసీ కార్మిక సంఘాల నేతలు ఉన్నతాధికారుల కమిటీతో రెండో దఫా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర సచివాలయంలో జరుగుతోన్న ఈ చర్చల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజు, దాన కిషోర్ , ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలతో కూడిన ఉన్నత స్థాయి అధికారుల కమిటీ, RTC ఉద్యోగులు లేవనెత్తిన 32 అంశాలపై పరిశీలిస్తోంది.

