ఏ స్కూల్ వెళ్లినా అన్నీ సమస్యలే..పనులైతలే

ఏ స్కూల్ వెళ్లినా అన్నీ సమస్యలే..పనులైతలే
  • చాలా స్కూళ్లలో ఇంకా మొదలు కాలె  
  • ప్రారంభించిన చోట్ల నెమ్మదిగా
  • ఏ స్కూల్​కు వెళ్లినా అన్నీ సమస్యలే
  • 60 శాతానికి పైగా వాటిల్లోటాయిలెట్లు లేవు
  • 30 శాతానికి పైగా బడుల్లో గోడల్లేవు
  • రీ ఓపెన్ లోపు పూర్తి కావడం కష్టమే

హైదరాబాద్​, వెలుగు: సర్కార్​బడులను కార్పొరేట్​స్థాయిలో తీర్చిదిద్దుతామని ‘మన ఊరు–మనబడి, ‘మన బస్తీ–మన బడి’కి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫస్ట్​ ఫేజ్​లో భాగంగా 35 శాతం స్కూళ్ల రూపురేఖలు మారుస్తామని ప్రకటించినా ఆ విధంగా పనులైతే జరగట్లేదు. ప్రధానంగా తాగునీరు, ఫర్నిచర్‌‌‌‌, టాయిలెట్లు, విద్యుత్‌‌‌‌, గ్రీన్‌‌‌‌ చాక్‌‌‌‌ బోర్డులు, పెయింటింగ్‌‌‌‌, ప్రహరీ, కిచెన్‌‌‌‌ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్‌‌‌‌ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, హై స్కూళ్లలో డైనింగ్‌‌‌‌ హాళ్లు.. ఇలా 12 అంశాలపై అధికారులు ఫోకస్​పెట్టారు. 

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో  మొత్తం 3,591 స్కూళ్లు ఉండగా, ఫస్ట్ ఫేజ్ లో 1,250 ఎంపిక చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల పనులు మొదలు పెట్టారు. మెజారిటీ స్కూళ్లలో ఇంకా ప్రారంభమే కాలేదు. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలో చాలా స్కూళ్లలో  పనులు స్టార్ట్ చేయలేదంటే  ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తం స్కూళ్లలో 60 శాతానికిపైగా టాయిలెట్లు సక్కగ లేవు. మరో 40 శాతం వరకు బిల్డింగ్​లకు మరమ్మతులు, 30 శాతం స్కూళ్లకు కాంపౌండ్​ వాల్ ​అవసరమని, డైనింగ్ హాల్స్​అయితే ఎక్కడ లేకపోవడం, కిచెన్లు, క్లాసు రూమ్​ల్లో బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డులు ఇలా ఏ స్కూల్​కు వెళ్లి చూసినా ఏదో ఒక సమస్య వెలుగులోకి వచ్చింది. 

నిర్వహణ లేకనె..

 రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అయింది. ఇన్నేండ్లలో స్కూళ్లపై ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం  ఫోకస్ పెట్టింది. అయితే స్కూళ్లల్లో నిర్వహణ సరిగా లేకపోవడంతో భవనాలు శిథిలావస్థకు చేరాయి. అటెండర్లు లేక రోజువారీ క్లీనింగ్​కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల స్టూడెంట్స్ నే  స్కూల్​ పనులు చేసుకుంటారు. స్కూల్​ముగిసిన తర్వాత టీచర్లు తాళాలు వేసుకొని వెళ్తుంటారు. వాచ్ మెన్ లు కూడా లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు భవనాలను డ్యామేజ్ చేయడం,  అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. 

పనులు ఇప్పుడు మొదలైతె..

రంగారెడ్డి జిల్లాలో కొన్నిచోట్ల మాత్రమే పనులు చేపట్టారు. ఈ జిల్లాలో 464 స్కూళ్లను ఎంపిక చేయగా సగానికిపైగా పనులు మొదలు పెట్టలేదు. వికారాబాద్​జిల్లాలో 371 స్కూళ్లను ఎంపిక చేయగా ఒక్కచోట కూడా ప్రారంభించలేదు. కేవలం 50 చోట్ల టెండర్లు పూర్తి చేశారు. హైదరాబాద్ జిల్లాలో 239 స్కూళ్లను ఎంపిక చేయగా ఈనెల 9న పనులు షురూ చేశారు. మేడ్చల్​ జిల్లాలో 176 స్కూళ్లను ఎంపిక చేయగా పదుల సంఖ్యలో మాత్రమే స్టార్ట్​చేశారు. స్కూళ్లు రీ ఓపెన్ చేసేందుకు నెల రోజుల టైమ్ మాత్రమే ఉంది. అంతలోపు పనులు పూర్తి కావడం కష్టంగానే ఉంది. 

నిధుల కొరత.. 

ఎంపికైన స్కూళ్లలో పనులు చేపట్టేందుకు ఒక్కో స్కూల్​కు సదుపాయాలను బట్టి ఖర్చు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో పనులు మొదలుకాగా, కొన్నిచోట్ల ఫండ్స్​కొరతతో ముందుకుసాగడంలేదని తెలిసింది. నిధులు కేటాయించకుండా పనులు మొదలు పెట్టాలంటే అధికారులకు కష్టంగా మారింది. టెండర్లకు పిలిచిన కూడా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావడంలేదు. గతంలో చేసిన పనులకే ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోగా ఇప్పుడు మళ్లీ ఇబ్బందుల్లో పడతామని చాలా చోట్ల చేసేందుకు ఇంట్రెస్ట్ ​చూపడం లేదు. 

అవసరమున్న చోట గుర్తించలె..

మొత్తం స్కూళ్లలో 35 శాతం ఫస్ట్ ఫేజ్​లో భాగంగా పనులు చేస్తున్నట్లు అధికారులు చెబుతుండగా, మరోవైపు  అవసరమైన బడులను ఎంపికచేయలేదు. రంగారెడ్డి జిల్లాలోని హైదర్షకోట్​స్కూల్​కు కాంపౌండ్ వాల్​ లేకపోవడంతో పశువులు, కుక్కలకు నిలయంగా మారింది. వికారాబాద్​జిల్లా కోటపల్లి మండలం ఒగులాపూ ర్ స్కూల్​కు గోడ లేకపోవడంతో పాటు బిల్డింగ్​శిథిలావస్థకు చేరినా గుర్తించలేదు. వికారాబాద్​జిల్లా బంట్వారం మండలం తోర్​మామిడిలో పదేండ్ల కిందట  కోటి 20లక్షల తో నిర్మించిన హైస్కూల్ పూర్తిగా పనికి రాకుండా తయారైంది. గ్రామానికి కిలోమీటర్​దూరంలో అన్ని వసతులతో నిర్మించగా కొన్నేండ్లు కొనసాగింది. దూరం కావడంతో గ్రామంలోని పాత స్కూల్ లోనే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. దీంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంది.  ఇలా చాలాచోట్ల పనులు అత్యవసరమైన స్కూళ్లను ఎంపికచేయలేదు. అధికారులను అడిగితే రెండో ఫేజ్​లో చేస్తామంటున్నా ఎప్పుడనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. 

రీ ఓపెన్ లోపు చేయకుంటె..

స్కూళ్లలో అన్ని సౌలతులు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పి నెలలు గడుస్తున్నా ఇంకా పనులు జరగడం లేదు. ఫస్ట్ ఫేజ్ కింద కేవలం 35 శాతం స్కూళ్లను మాత్రమే ఎంపిక చేసి మిగతా వాటిని పట్టించుకోవడం లేదు. స్కూళ్లు రీ ఓపెన్ అయ్యేలోపు అన్నిపనులు పూర్తి చేయకపోతే ఆందోళనలు నిర్వహిస్తాం. 
- సూర్య, ఎన్ఎస్ యూఐ మేడ్చల్ జిల్లా సెక్రటరీ

నెల రోజుల్లో పూర్తి చేయకపోతె..

‘మన ఊరు–మన బడి’తో ప్రభుత్వం మరో దోపిడీకి తెరలేపింది.  ప్రభుత్వ స్కూళ్లపై అంత ప్రేమ ఉంటే కరోనా టైమ్​లోనే అన్ని పనులు పూర్తి చేయాల్సింది. ఈ సమ్మర్​లో చేస్తామన్నప్పటికీ, చాలాచోట్ల ఇంకా పనులు మొదలుపెట్టలేదు.  
- కమల్ సురేశ్, 
ఏబీవీపీ స్టేట్​జాయింట్ సెక్రటరీ 

పనులు చేస్తున్నం

సమస్యలు ఉన్న స్కూళ్లను గుర్తించి అన్ని పనులు చేస్తున్నం. ఇప్పటికే మొదలు పెట్టాం. నెలరోజుల్లో  పూర్తి చేస్తాం. ప్రభుత్వం నిర్ణయం మేరకు రెండో ఫేజ్​లో మరిన్ని స్కూళ్లలో చేస్తాం.  స్కూళ్లలో ఏ ప్రాబ్లమ్ రాకుండా పనులు చేపడుతున్నం.
- రోహిణి, డీఈవో, హైదరాబాద్​ జిల్లా