8 ఏండ్ల జైలు జీవితం గడిపిన నిర్దోషి.. ప్రభుత్వ ఉద్యోగమిస్తానని సీఎం హామీ

8 ఏండ్ల జైలు జీవితం గడిపిన నిర్దోషి.. ప్రభుత్వ ఉద్యోగమిస్తానని సీఎం హామీ
మణిపూర్: అత్యాచారం, హత్య కేసులో నిర్దోషిగా తేలిన ఓ వ్యక్తికి ఉద్యోగావకాశం కలిపించింది మణిపూర్ ప్రభుత్వం. ఎనిమిది సంవత్సరాల జైలు జీవితం గడిపిన సదరు వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్ బిరెన్ సింగ్. 2013లో ఓ రీసెర్చ‌ర్ (పాథాలజీ విభాగం) పై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న తౌడమ్ జిబల్ సింగ్.. సాజివా సెంట్రల్ జైలులో ఎనిమిది ఏండ్లు శిక్ష అనుభ‌వించాడు. ఆ సమయంలో ప్రజలు ఆగ్రహంతో అతని ఇంటిని కాల్చేశారు. సోమ‌వారం స్థానిక సెషన్సు కోర్టు అత‌న్ని నిర్దోషిగా ప్ర‌క‌టించగా.. త‌న విడుద‌ల అనంత‌రం జిబల్ సింగ్‌ ముఖ్యమంత్రిని కలిశాడు. అత‌ని ప‌రిస్థితి గురించి తెల‌సుకున్న సీఎం.. ఎలాంటి తప్పు చేయకుండా 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. జిబల్ సింగ్ కు ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు అతనికి అటవీశాఖలో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని హామి ఇచ్చారు.