నిప్పుతో గేమ్స్ ​ఆడుతున్న కాంగ్రెస్: రాజ్​నాథ్​ సింగ్

నిప్పుతో గేమ్స్ ​ఆడుతున్న కాంగ్రెస్: రాజ్​నాథ్​ సింగ్

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రయోజనం కోసం హిందూ-– ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తూ కాంగ్రెస్​ నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని డిఫెన్స్​ మినిస్టర్​ రాజ్​నాథ్​సింగ్​ అన్నారు. మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్​ మాజీ చీఫ్​ రాహుల్​గాంధీలో ఫైర్​లేదని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా సంస్థకు ఇంట్యర్వ్యూ ఇచ్చారు. ‘కాంగ్రెస్​ మత సామరస్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నది. ముస్లిం కమ్యూనిటీని కేవలం ఓటుబ్యాంకుగానే చూస్తున్నది. 

వారికి నాదొక సూచన.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే రాజకీయం చేయకూడదు.. దేశ నిర్మాణమే రాజకీయాల లక్ష్యం కావాలి’ అని అన్నారు. ‘వారికి ఎలాంటి సమస్య లేదు. కులం, మతం పేరుతో సమాజాన్ని విడదీసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. వారి ఎప్పటినుంచో ఇది చేస్తున్నారు’ అని కాంగ్రెస్​నుద్దేశించి రాజ్​నాథ్​సింగ్​ వ్యాఖ్యానించారు. 

వారసత్వ పన్నుతో దేశంలో ఆర్థిక మాంద్యం  

కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేయాలని చూస్తున్నదని, దీంతో దేశంలో ఆర్థిక మాంద్యం వస్తుందని రాజ్​నాథ్​సింగ్​ పేర్కొన్నారు. ఈ ట్యాక్స్​ను అమలుచేసిన అర్జెంటీనా, వెనెజులా దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నాయని చెప్పారు. భారత్​పై ఇన్వెస్టర్లు విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు. ఈ లోక్​ సభ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాల్లో, ఎన్​డీఏ కూటమి 400 సీట్లలో విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. దేశ ఐక్యత, సమగ్రతపై రాజీపడబోమని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు.