సర్పంచ్ సాబ్ ఆగయా..పంచాయతీల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు..

సర్పంచ్ సాబ్ ఆగయా..పంచాయతీల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు..
  • పలుచోట్ల అట్టహాసంగా సర్పంచుల ప్రమాణ స్వీకారాలు
  •     నిర్మల్ జిల్లా తానూరులో గుర్రంపై వచ్చి ప్రమాణం
  •     కొన్నిచోట్ల తొలిరోజే హామీల అమలుకు శ్రీకారం
  •     పంచాయ‌‌‌‌తీ సిబ్బందికి రూ.15 లక్షల బీమా చేయించిన సర్పంచ్

హైద‌‌‌‌రాబాద్/నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో కొత్త పాలన మొదలైంది. దాదాపు రెండేండ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. 12,702 పంచాయతీలకు సర్పంచులు, ఉపసర్పంచులు, 1,11,803 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.

సర్పంచులు సొంత ఖర్చులతో ఆఫీసులకు రంగులు వేయించారు. పలువురు సర్పంచులు బాజాబజంత్రీలు, ఊరేగింపులతో వచ్చి బాధ్యతలు స్వీకరించగా.. మరికొందరు గెలిచిన తొలిరోజే హామీల అమ‌‌‌‌లుకు శ్రీకారం చుట్టారు. 

పలుచోట్ల చిన్నచిన్న ఘర్షణలు, గందరగోళం మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాణస్వీకార కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. పలుచోట్ల పాల‌‌‌‌క వ‌‌‌‌ర్గాల ప్రమాణస్వీకారోత్సవాలు కన్నులపండువగా జరిగితే ఇంకొన్నిచోట్ల వసతుల లేమితో ఇబ్బందిపడ్డారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బొంద్రాట్ సర్పంచ్ రవీందర్ పటేల్ గుర్రంపై బాజాబజంత్రీల నడుమ ఊరేగింపుగా వచ్చి బాధ్యతలు స్వీకరించారు. 

కోటగిరి మండలం రాంపూర్ సర్పంచ్ విస్లావత్ సామ్ కీ బాయి గిరిజన సంప్రదాయంలో ప్రమాణం చేసి ఆకట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నల్లబండ బోడులో పంచాయతీ భవనం నిర్మాణంలో ఉండటంతో.. కొత్త సర్పంచ్ గడిగ సింధు చెట్ల కిందే ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది.

తొలిరోజే హామీల అమలు.. 

  •  రాజన్న సిరిసిల్ల జిల్లా కందికట్టుకూరు లో తనను గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద తీరుస్తానని బీఆర్ఎస్ మద్దతుదారు విజయమ్మ హామీ ఇచ్చారు. ఆమె         విజయం సాధించడంతో ప్రమాణస్వీకారానికి ముందు రోజే సూర్యాపేట నుంచి ప్రత్యేకంగా టీమ్​ను రప్పించి కోతులను పట్టించారు.
  •  నిర్మల్ జిల్లా లోకేశ్వరం సర్పంచ్ ధార్వాడి కపిల్.. పంచాయతీ సిబ్బంది పట్ల ఔదార్యం చాటుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయగానే పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న 9 మంది మల్టీపర్పస్ వర్కర్లకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున ప్రమాద బీమా చేయించారు. ఐదేండ్ల పాటు ప్రీమియం తానే కడతానని ప్రకటించి రశీదులు అందజేశారు.
  •   కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎల్కపల్లి సర్పంచ్ భక్తు రాంచందర్.. తొలిరోజే ఎన్నికల హామీ నిలబెట్టుకున్నారు. గ్రామానికి చెందిన శ్రీరామ రాకేశ్​కు ఆడబిడ్డ జన్మించగా, ఆ కుటుంబానికి   రూ.5,116 చెక్కుపై సంతకం చేసి పాలకవర్గం సమక్షంలో అందించారు.
  •  ఆసిఫాబాద్ మండలం మోతుగూడ సర్పంచ్ బొట్టుపల్లి గోపాల్ ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే హనుమాన్ ఆలయ కోనేరులో భక్తుల కోసం సొంత ఖర్చుతో కొత్త నీటి మోటారు వేయించారు.
  •  నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ధర్మోరా సర్పంచ్ గా ఎన్నికైన మామిడి సంజీవరెడ్డి నెలకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే గౌరవ వేతనంగా తీసుకుంటాన‌‌‌‌ని హామీ ఇచ్చారు. మిగతా మొత్తo రూ.6,499ని గ్రామాభివృద్ధి కోసమే ఖర్చు చేస్తానని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించారు.
  •  ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామపంచాయతీలో సర్పంచ్, పాలకవర్గం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత గ్రామపంచాయతీ కార్యాలయంలో కొత్తగా కొలువుదీరిన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రూ.10 లక్షలు ప్రభుత్వ నిధులతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.

మద్యం ముట్టను.. ముట్టనివ్వను

యువతను పెడదోవ పట్టిస్తున్న మద్యంపై కొందరు సర్పంచులు యుద్ధం ప్రకటించారు. తాను ఐదేండ్లు మద్యం తాగనని.. తాగేవాళ్లను ప్రోత్సహించనంటూ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుజ్జవానికుంట తండా సర్పంచ్ గుగులోత్ దూప్ సింగ్ నాయక్ ప్రమాణం చేశారు. 

యువత భవిష్యత్తు కోసం తానే మొదటి అడుగు వేస్తున్నానని ప్రకటించారు. నల్గొండ జిల్లా సాగర్ తిరుమలగిరి మండలంలోని కొంపల్లి సర్పంచ్‌‌‌‌ జంగాల సాలమ్మ ప్రమాణం స్వీకారం సందర్భంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లకు డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేక ‘స్వచ్ఛ కొంపెల్లి, స్వచ్ఛ స్వరాజ్‌‌‌‌’ పేరుతో రోడ్లను క్లీన్‌‌‌‌ చేశారు. తర్వాత సాదాసీదాగా ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు.